భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి మామూలుగా లేదుగా?
రేవంత్ కుమార్తెను వెంకటరెడ్డి కుమారుడికి ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేయటం తెలిసిందే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఎల్ బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకలాంటి ఉత్సవ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. అదే సమయంలో.. ఏపీలోనూ కొందరు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలోని భీమవరంలో సందడిగా మారింది.
కారణం.. రేవంత్ రెడ్డి వియ్యంకుడి వారిది భీమవరం కావటమే. రేవంత్ రెడ్డి వియ్యంకుడు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూం అధినేత వెంకటరెడ్డి అన్న విషయం తెలిసిందే. రేవంత్ కుమార్తెను వెంకటరెడ్డి కుమారుడికి ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేయటం తెలిసిందే. తాజాగా రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో వెంకటరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టారు.
ఇదిలా ఉండగా.. తమ అల్లుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు.. బంధుమత్రులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటితో పాటు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని ఆయన నివాసానికి నిరంతరం విద్యుత్ సరఫరా అంశాలపై కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటికి గతంలో జూబ్లీహిల్స్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేది. ఆ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే.. విద్యుత్ సరఫరా ఆగకుండా ఉండేందుకు వీలుగా వేరే లైన్ నుంచి ప్రత్యామ్నంగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించినగజ్వేల్ తరహాలో రేవంత్ ప్రాతినిధ్యం వహించే కొండగల్ నియోజకవర్గంలోనూ విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.