మన దేశంలోని ఈ ప్రాంతాల్లో “సహజీవనం ఒక సదాచారం”!
ఛత్తీస్ గఢ్ లోని "మురియా" తెగ సంగతి అలా ఉంటే... జార్ఖండ్ లోని "కొర్వా" తెగలో కూడా ఈ సహజీవనం సబ్జెక్ట్ ఉంది! ఇక్కడ కూడా ఈ తెగలోని వారు తమకు నచ్చిన వారితో ఎన్నాళైన సహజీవనం చేయొచ్చు.
పెళ్లికి ముందే కార్యం (శృంగారం / శోభనం...) చేసుకోవాలి.. నచ్చితే కల్యాణం చేసుకోవాలి! ఈమాట పెద్దలెవరైనా వింటే తరిమి తరిమి కొడతారనండంలో సందేహం ఉండకపోవచ్చు! విలువలకూ, సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటి భారతదేశంలో ఇలాంటి మాటలా అని ఫైరయిపోతారు. వాస్తవానికి ప్రస్తుతం నడుస్తున్న సహజీవనం ట్రెండ్ ఈ కోవలోకే వస్తుందనేది తెలిసిన విషయమే. అయితే... ఇలాంటి ఆచారాన్ని (పద్దతిగా) పాటిస్తోన్న పలు తెగలు మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.
సహజీవనం అనేది ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అనేవారు. పైగా అలా కలిసి ఉండటానికి గ్రామాల్లో అయితే వేరే పేర్లు పెట్టేవారు! అయితే అదంతా అప్పుడు! ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది! అయితే... ఈ ట్రెండ్ ని ఎన్నో ఏళ్ల నుంచి తాము అనుసరిస్తున్నామని, ఇది తమకు సహేతుకంగా ఉండటమే కాకుండా... అక్కడ విడాకుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.
అవును... ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో నివసించే "మురియా" తెగ ప్రజలు సహజీవనాన్ని ఎప్పటినుంచో పాటిస్తున్నారు. అయితే ఇది ట్రెండ్ అనీ, దీనిపేరు అది అని వారికి తెలుసా తెలియదా అనే సంగతి పక్కనపెడితే... తల్లిదండ్రులతో సహా ఆ ప్రాంతపు ప్రజలందరూ కలిసి యువతీ యువకుల్ని సహజీవనం చేసేలా ప్రోత్సహించడం అక్కడ స్పెషాలిటీ!
ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ప్రజలంతా కలిసి వెదురుతో ఓ గుడిసెను నిర్మిస్తారు. గ్రామానికి చెందిన యువతీ యువకులంత చేరి అక్కడ ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఈ సమయంలో అబ్బాయిలు వెదురుతో విభిన్న రకాల దువ్వెనలు తయారుచేస్తారు. ఈ ఆటల్లో అమ్మాయికి ఏ అబ్బాయైతే నచ్చుతాడో.. అతడు తయారుచేసిన దువ్వెన దొంగిలిస్తుంది.
అంటే... దువ్వెన దొంగిలించి.. తన మనసును దొంగిలించింది నువ్వే అని అతడికి పరోక్షంగా చెబుతుందన్న మాట. అనంతరం వారిద్దరూ అదే గుడిసెలో కొన్నాళ్ల పాటు సహజీవనం చేస్తారు. ఇలా శారీరకంగా, మానసికంగా దగ్గరవుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంటకు పెద్దలు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు. ఈ వేడుకను వారు "గోతుల్" అని పిలుస్తారు. వాస్తవానికి యువత తమ లైంగికతను అర్థం చేసుకునే వాతావరణాన్ని సృష్టించేందుకు ఉద్దేశించిన గుడిసె "గోతుల్"!
ఈ ఆచారం వల్ల విడాకుల సమస్య తగ్గిందని చెబుతున్నారు!!
ఛత్తీస్ గఢ్ లోని "మురియా" తెగ సంగతి అలా ఉంటే... జార్ఖండ్ లోని "కొర్వా" తెగలో కూడా ఈ సహజీవనం సబ్జెక్ట్ ఉంది! ఇక్కడ కూడా ఈ తెగలోని వారు తమకు నచ్చిన వారితో ఎన్నాళైన సహజీవనం చేయొచ్చు. దీంతోల్... జీవితాంతం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండడం ఇక్కడ సర్వసాధారణంగా చెబుతారు. అయితే దీనికి ఒక బలమైన కారణం ఉంది. పెళ్లి చేసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే ఇక్కడి ప్రజలు ఇలా ఏళ్ల తరబడి సహజీవనం చేస్తుంటారట!
ఈ తరహా సంప్రదాయాన్నే "ధుకు వివాహం"గా పరిగణిస్తుంటారు. ఇక సహజీవనంలో ఉండే అమ్మాయిని "ధుకుని", అబ్బాయిని "ధుకువా"గా పిలుస్తారు.
ఈ ఆచారం వల్ల పెళ్లి పేరు చెప్పి డబ్బులు తగలేయాల్సినవసరం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆ రెండు రాష్ట్రాల్లోని తెగల సంగతి అలా ఉంటే... రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న "గరాసియా" తెగలో కూడా ఇలాంటి ఆచారమే ఉంది. ఇక్కడ పెళ్లి చూపులంటే రెగ్యులర్ గా అందరికీ తెలిసినట్లుగా ఉండవు. అమ్మాయిని కూర్చోబెట్టి.. సినిమాల్లో చూపించినట్లు అబ్బాయి తరుపు వారు ప్రశ్నలడగడం, నవ్వమనడం, నడవమనడం వంటివి ఉండవు!! ఒక జాతరలో చూసుకుని ఫిక్స్ అయిపోవడమే!
అవును... ఈ తెగ ఆచారం ప్రకారం... మ్యాట్రిమొనీ వెబ్ సైట్లు నిర్వహించే "వధూవరుల పరిచయ వేదిక" కార్యక్రమానికి కాస్త అటు ఇటు టైపులో ఇక్కడ రెండు రోజుల పాటు ఒక ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో యువతీయువకులు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుంటారు. దీంతో.. కొన్నాళ్లపాటు వీరిద్దరూ సహజీవనం చేశారు.
ఈ సమయంలో అబ్బాయి తరుపు వారు.. అమ్మాయి తరుపు వారికి కొంత సొమ్ము కట్నంగా ఇస్తారు. ఈ సహజీవనంలో ఇద్దరి మధ్య ప్రేమ పెరిగితే ఆపై పెళ్లి చేసుకోవడం.. లేదంటే పిల్లలు పుట్టాక అయినా సరే విడిపోవడం ఈ తెగలో కనిపిస్తుంది. ఇలా తమ భాగస్వామి నుంచి విడిపోయినవారు.. మరోసారి నిర్వహించే సంతలో కొత్త భాగస్వామిని వెతుక్కోవచ్చట!
ఈ ఆచారం వల్ల వరకట్న వేధింపులు, గృహహింస.. వంటి సమస్యలు చాలా వరకు తగ్గినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పైన చెప్పుకున్న అన్ని తెగలలోనూ.. మహిళలకు తగిన స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమిచ్చేందుకే ఈ ఆచారాలను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుండటం!