ఆ పదవులకు భారీ డిమాండ్... ప్రయత్నాలు ముమ్మరం!

ఈ క్రమంలో ఈ విషయాలపై స్పందించిన పలువురు సీనియర్లు... యువకులకు పదవులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు

Update: 2024-06-15 05:11 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ 24మందికి మంత్రి పదవులు దక్కాయి. ఈ విషయంలో సీనియర్స్ కంటే జూనియర్స్, ప్రెషర్స్ లక్కీ అనే మాటలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఈ విషయాలపై స్పందించిన పలువురు సీనియర్లు... యువకులకు పదవులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇప్పుడు అసలు చర్చంతా నామినేటెడ్ పోస్ట్ లపై మొదలైందని అంటున్నారు.

అవును... ఏపీలో 24మందికి మంత్రి పదవులు దక్కాయి. మరోపక్క ఇప్పట్లో ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం లేకపోవడంతో నేతలంతా నామినేటెడ్ పదవులపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో పదవులూ భారీగానే ఉన్నాయనుకునేలో లోపు.. వాటిపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల సంఖ్య కూడా అంతకు మించి అన్నట్లుగా ఉందని అంటున్నారు. దీంతో ఈ పదవులు ఎవరిని వరించనున్నాయనేది ఆసక్తిగా మారింది.

వాస్తవానికి మంత్రిపదవులు దక్కనివారంతా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, దేవస్థానల పదవులపై మనసుపడుతుంటారని అంటుంటారు. ఈ లెక్కన చూసుకుంటే... ఏపీలో సుమారు 12 కీలకమైన దేవస్థానాలున్నాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రధానంగా తిరుమల పేరు వినిపిస్తుందనేది తెలిసిన విషయమే. ఇక్కడ ఛైర్మన్ పోస్ట్ తో పాటు బోర్డు మెంబర్ పోస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది!

ఇదే సమయంలో విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం దేవస్థానం, అన్నవరం సత్యనారాయణ స్వామి, అరసవిల్లి సుర్యనారాయణ స్వామి, కాణిపాకం వినాయకస్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, కడప ఒంటిమిట్ట రామాలయం వంటి కీలక దేవాలయాలకు బోర్డులు, వాటి పాలక మండళ్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు.

వీటితోపాటు రాష్ట్రంలో సుమారు 56 సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే 56 ఛైర్మన్ పోస్ట్లు, వైఎస్ ఛైర్మన్ పొస్టులతో పాటు పలు పోస్టులు ఉంటాయి. వీటిలో ప్రధానంగా... ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ పోస్టులకు భారీ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. దీంతో... ఆశావహులంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు.

Tags:    

Similar News