ఒక్క బిస్కెట్.. ఒకే ఒక్క బిస్కెట్... ఎంత పనిచేసిందంటే!
సదరు బిస్కెట్ కంపెనీతోపాటు విక్రయించిన స్టోర్‌పై రూ.100 కోట్లు జరిమానా విధించడంతోపాటు తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించాడు.
చెన్నైకి చెందిన యువకుడు ఢిల్లీ బాబు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. దానిపై 16 బిస్కెట్లు ఉన్నాయని రాసి ఉంది. అయితే.. ఢిల్లీ బాబు ఈ ప్యాకెట్‌ను ఓపెన్ చేస్తే.. దానిలో కేవలం 15 బిస్కెట్లే ఉన్నాయి. దీంతో సాధారణంగా మనమైతే సర్దుకు పోతాం. కానీ, ఢిల్లీబాబుకు తెలివి ఎక్కువ. వెంటనే చెన్నైలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. సదరు బిస్కెట్ కంపెనీతోపాటు విక్రయించిన స్టోర్‌పై రూ.100 కోట్లు జరిమానా విధించడంతోపాటు తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించాడు.
బిస్కెట్ కంపెనీ ఏమందంటే
ఢిల్లీబాబు ఫిర్యాదుతో ఉలిక్కి పడిన బిస్కెట్ తయారీ సంస్థ.. ఐటీసీ తనదైన వాదన వినిపించింది. బిస్కెట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవద్దని, బరువు ఆధారంగానే దాన్ని విక్రయిస్తామని వినియోగదారుల ఫోరంలో వాదించింది. తూనికలు కొలతల శాఖ నిబంధనలకు లోబడే దాని బరువు ఉందని.. అందులో ఎటువంటి లోపమూ లేదని పేర్కొంది.
లక్ష జరిమానా
అయితే, బిస్కెట్ కంపెనీ వాదనతో జిల్లా వినియోగదారుల ఫోరం విభేదించింది. కవర్‌పై బిస్కెట్‌ల సంఖ్యను స్పష్టంగా పేర్కొన్నందున.. కచ్చితంగా దాని ఆధారంగానే వినియోగదారుడు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. వినియోగదారుడికి రూ.లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.