సెబీ సారథిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఏమిటవి?

తాజాగా మరోసారి ఆమె లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-03 05:30 GMT

సంచలన ఆరోపణల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ కు సారధిగా వ్యవహరిస్తూ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ నుంచి జీతభత్యాల్ని అందుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపణలు చేశారు. సెబీ సారథిగా వ్యవహరిస్తున్న మాధవి పురి బుచ్ మీదా ఇటీవల హిండెన్ బర్గ్ ఆరోపణలు చేయటం.. వాటిపై మార్కెట్ అస్సలు రియాక్టు కాకపోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి ఆమె లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాము చేసిన ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలంటూ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని.. కేంద్ర హోం మంత్రి నాయకత్వంలో నియామకాల కమిటీ సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రివర్గానికి చెందిన నియామకాల కమిటీ.. మాధవీని లేటరల్ ఎంట్రీ పద్దతిలో సెబీలో నియమించటాన్ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా తాము లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకోవాలన్నారు. మాధవిని వెంటనే సెబీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబరు 4 వరకు సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవి.. 2022 మార్చి 2న సెబీ ఛైర్ పర్సన్ గా ఎన్నిక కావటం తెలిసిందే. 2017లో సెబీలో సభ్యురాలిగా చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారి హోదాలో రూ.16.08 కోట్లు అందుకున్నట్లుగా పేర్కొన్నారు.

సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవి ఐసీఐసీఐ బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతూనే.. ఆ బ్యాంకు నుంచి ఆదాయం పొందారన్న విషయం ప్రధాని మోడీకి తెలుసా? అంటూ ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. 2013అక్టోబరు 31న మాధవి తమ వద్ద పదవీ విరమణ చేసిన తర్వాత ఆమెకు పదవీ విరమణకు సంబంధించిన ప్రయోజనాలు మినహా ఎలాంటి వేతన చెల్లింపులు జరపలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. మాధవీ పైన జీ ఎంటర్ టైన్ మెంట్ గౌరవ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను ఒక అవినీతిపరురాలిగా అభివర్ణించిన ఆయన.. ఆమె తనపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఐసీఐసీఐ బ్యాంకులో చందా కొచ్చర్ కీలకంగా ఉన్న వేళలో మాధవీ చాలా సన్నిహితంగా ఉండేవారని.. తరచూ ఫోన్స్ చేసేవారని తమ పరిశోధనలో తేలినట్లుగా సుభాష్ చంద్ర ఆరోపించారు. మొత్తంగా సెబీ ఛైర్ పర్సన్ మీద వెల్లువెత్తుతున్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. వీటి ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఎంత పడనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News