హరియాణాలో ఆధిక్యంలో కాంగ్రెస్... క్లియర్ మెజారిటీ దిశగా ఫలితాలు!?

హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాలి.

Update: 2024-10-08 03:49 GMT

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీనికోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకూ వెలువడిన ఆధిక్య ఫలితాల మేరకు హరియాణాలో ఓటర్లు బీజేపీ షాక్ ఇచ్చారని, కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది!

అవును... హరియాణాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేయగా.. ఈసారి అధికారం తమదేనని, మోడీ 3.0పై ప్రజల్లో వ్యతిరేకతకు ఇది మచ్చు తునక అని కాంగ్రెస్ వ్యాఖ్యానించిన పరిస్థితి! ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ దాదాపు కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి కూడా!

ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేసే దిశగా వెలువడుతున్నాయి. హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాలి. అయితే ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు 60 కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు!

ఇదే సమయంలో బీజేపీ నుంచి 20 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మిగిలిన పార్టీలకు, ఇండిపెండెంట్లకు ఎలాంటి అవకాశం లేకుండా.. హరియాణా ప్రజలు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా... హరియాణాలోని 90 నియోజకవర్గాల్లోనూ 1,031 మంది పోటీ చేయగా.. వారిలో 464 మంది ఇండిపెండెంట్లు. ఈ నెల 5న జరిగిన పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నేడు ఉదయం 8 గంటలకే మొదలైంది. ఇప్పటికే వెలువడుతున్న ఆధిక్య ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం తెస్తున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News