0.9 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ పవర్ మిస్

ఎన్నికల వేళ ప్రతి ఓటు విలువైనదే. చిన్న తేడాలు సైతం అధికారాన్ని చేజారేలా చేస్తుంటాయి.

Update: 2024-10-09 06:02 GMT

ఎన్నికల వేళ ప్రతి ఓటు విలువైనదే. చిన్న తేడాలు సైతం అధికారాన్ని చేజారేలా చేస్తుంటాయి. తాజాగా హర్యానా ఎన్నికల ఫలితం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మంగళవారం వెలువడిన ఓటర్ల తీర్పు ఎగ్జిట్ అంచనాలకు భిన్నంగా ఉండటంతో పాటు.. బీజేపీకి భారీ ఊరటను ఇచ్చిందని చెప్పాలి. ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. ఆసక్తికకరమైన విషయం ఏమంటే.. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ అంచనాలకు భిన్నంగా ఎన్నికల పలితాలు వెలువడ్డాయి.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో చిన్న పాటి ఓట్ల శాతం తేడా.. కాంగ్రెస్ చేతికి అధికారం రానివ్వలేదు. ఓట్ల లెక్కింపు వేళ.. పోటాపోటీగా.. ఒక దశలో ఎవరు అధికారాన్ని సొంతం చేసుకుంటారన్న టెన్షన్ తెప్పించిన హర్యానా ఫలితం చివరకు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. చిన్నపాటి వ్యత్యాసం కాంగ్రెస్ చేతికి నుంచి బీజేపీ గూటికి అధికారం వెళ్లేలా చేసిందని చెప్పాలి.

మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 39.94 శాతం ఓట్లను సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 39.09 శాతం దగ్గర ఆగిపోయింది. అంటే.. 0.9 ఓట్ల తేడా కాంగ్రెస్ చేతికి అధికారం లేకుండా చేసింది. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 8 శాతం ఓట్ల వ్యత్యాసం కాంగ్రెస్ అధికార కలల్ని కల్లలు చేసింది. 39.94 శాతంతో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధిస్తే.. 39.09 శాతం ఓట్లతో కాంగ్రెస్ 37 స్థానాల వద్ద ఆగింది. 4.14 శాతం ఓట్లతో ఐఎన్ఎల్ డీ (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) రెండు స్థానాలు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

స్వల్ప అధిక్యం బీజేపీకి అధికారాన్ని సొంతం చేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 శాతం ఓట్లను పెంచుకోగా.. బీజేపీ సైతం 3 శాతం ఓట్లను పెంచుకుంది. ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ.. ప్రతిపక్ష నేత భూపీందర్ సింగ్ హుడ్డా.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. ప్రముఖ పారిశ్రామికవేత్త సావిత్రీ జిందాలు తదితరులు ఉన్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి.

మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు.. స్పీకర్ సైతం ఓడిన వారిలో ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా వెలువడిన ఫలితాల్ని అంగీకరించలేదని స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఎన్నికల ఫలితం వచ్చింది. అయితే.. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. ఈసారి తమ విజయం ఖాయమన్న అత్యుత్సాహం.. అతివిశ్వాసం కాంగ్రెస్ పోరాట పటిమను తగ్గించాయని.. అదే వారి కొంప ముంచటంతో పాటు.. అధికారానికి దూరమయ్యేలా చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News