హర్యానా ఫలితాన్ని అంగీకరించని కాంగ్రెస్.. జమ్ముకశ్మీర్ మాటేంటి?

హర్యానా.. జమ్ముకశ్మీర్ లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.

Update: 2024-10-09 15:30 GMT

అందుకే అంటారు.. ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయాలని. అందునా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో ఒక జాతీయ పార్టీ స్పందించే తీరులో న్యాయం.. ధర్మంతో పాటు.. లాజిక్ కూడా మిస్ కాకూడదు. ప్రత్యర్థులు సైతం నిజమే కదా? అన్న ఆత్మరక్షణలో పడేలా వాదన ఉండాలి. అందుకు భిన్నంగా తాను చేసిన పేలవమైన వాదనతో.. ప్రత్యర్థులు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేక కళ్లు తేలేసే వైనం చూసిననప్పుడు.. కాంగ్రెస్ అధినాయకత్వానికి సరైన వ్యూహం ఉండదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇటీవల ముగిసిన హర్యానా.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడటం తెలిసిందే. హర్యానాలో బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంటే.. జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కు కశ్మీరీలు పట్టం కట్టారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని బీజేపీ సొంతం చేసుకున్నప్పటికి.. అధికారాన్ని మాత్రం సొంతం చేసుకోని పరిస్థితి.

అదే సమయంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అయ్యాయి. హర్యానా.. జమ్ముకశ్మీర్ లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. జమ్ముకశ్మీర్ లో హంగ్ ఖాయమన్న అంచనాల్లో ఏ మాత్రం నిజం లేదని.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా క్లారిటీతో ఓట్లు వేసిన విషయం ఫలితాల్ని చూస్తే అర్థమవుతుంది.

హర్యానా ఎన్నికల ఫలితాన్ని తాము అంగీకరించమని కాంగ్రెస్ చెప్పొచ్చు. ఒకవేళ.. హర్యానా ఎన్నికల్ని ఈవీఎంలు ప్రభావితం చేసినట్లుగా ఆరోపిస్తే.. అదే సూత్రం జమ్మకశ్మీర్ రాష్ట్ర ఎన్నికలఫలితానికి కూడా వర్తిస్తుంది కదా? అలాంటప్పుడు హర్యానా కాదన్నప్పుడు జమ్ముకశ్మీర్ ఫలితాన్ని కూడా అంగీకరించకుండా ఉంటామని కాంగ్రెస్ చెప్పగలదా? అన్నది ప్రశ్న.

కాస్తంత బుర్ర ఉంటే చాలు.. ఎన్నికల ఫలితాల మీద అభ్యంతరం చెప్పేటప్పుడు.. అన్ని చూసుకొని మాట్లాడాలి కదా? ఆ మాత్రం తెలివి లేనట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన వ్యాఖ్యలు పేలవంగా ఉండటమే కాదు.. వాదనకు ఏ మాత్రం సెట్ కానట్లుగా మారింది. హర్యానా ఎన్నికల ఫలితాన్ని అంగీకరించమని చెప్పటం ద్వారా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని తమ మాటల్లో లాజిక్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News