కాంగ్రెస్ తో టీడీపీ జెండాలు...ఉత్తరాదిన బీజేపీ హవా..
ఆ తరువాత టీడీపీ శ్రేణులకు ఏమి సందేశం వెళ్ళిందో తెలియదు నల్గొండ ఖమ్మం సహా హైదరాబాద్ లో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు టీడీపీ జెండాలు కనిపించాయి.
అదేంటో అపర చాణక్యుడి రాజకీయం ఈ మధ్య ఉల్టా పల్టా అవుతోంది. చంద్రబాబు ఒకటి తలిస్తే మరోలా రాజకీయ చిత్రం మారి ఆయనకు యమ టెన్షన్ పెడుతోంది. జైలుకు వెళ్లక ముందు తెలంగాణాలో పోటీకి సై అని చంద్రబాబు అన్నారు. కానీ అరెస్ట్ జైలు జీవితం తరువాత ఆయనలో మార్పు కనిపించింది.
పైగా కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణాలో పెరగడంతో పాటు పీసీసీ చీఫ్ గా ఒకనాటి శిష్యుడు రేవంత్ రెడ్డి ఉండడంతో పాటు ఆస్థాన మీడియా ఇచ్చిన సూచనలు పనిచేశాయో ఏమో పోటీ లేదు అనేశారు. ఆ తరువాత టీడీపీ శ్రేణులకు ఏమి సందేశం వెళ్ళిందో తెలియదు నల్గొండ ఖమ్మం సహా హైదరాబాద్ లో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు టీడీపీ జెండాలు కనిపించాయి.
ఇక కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. అది అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ తెలంగాణాలో గెలుస్తూంటే ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి మీదనే టీడీపీ జెండా ఎగిరే లెవెల్ లో. అయితే మామూలుగా అయితే ఇది టీడీపీకి మంచి బూస్ట్ ఇచ్చేదిగానే ఉండాలి. కానీ బీజేపీ ఉత్తరాదిన అదరగొట్టింది.
ఏకంగా మూడు రాష్ట్రాలలో బీజేపీ అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో గెలవడం అంటే మాటలు కాదు. ఇక తెలంగాణాలో కూడా బీజేపీ బాగానే పాకిపోయింది. మూడు నుంచి ఎనిమిది సీట్ల దాకా తన సత్తా చాటింది. అటు రేవంత్ ఇటు కేసీయార్ లను ఓడించిన ఘనత తన ఖాతాలో వేసుకుంది.
కనీసం ముప్పయి దాకా అసెంబ్లీ సీట్లలో బీజేపీ ప్రభావం చూపించింది అని లెక్కలు చెబుతున్నాయి. దాంతో రేపటి లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి తెలంగాణాలో మళ్లీ ఫ్యూచర్ ఉండొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. అంతే కాదు ఉత్తరాదిన బీజేపీ పని అయిపోలేదు సూపర్ స్పీడ్ తో ముందుకెళ్తోంది. మోడీ ప్రభ కూడా దివ్యంగా వెలుగుతోంది అని తెలిసి వచ్చింది.
సరిగ్గా ఇక్కడే టీడీపీ హై కమాండ్ ఇబ్బందులో పడింది అని అంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎందుకు ఆనందం ఇది ప్రజా తీర్పు తమ్ముళ్ళూ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం అంతా బీజేపీ కోసమే అని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో బీజేపీతో పొత్తుకు ప్లాన్ బీని టీడీపీ రెడీ చేస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే 2024లో మళ్లీ మోడీ రావచ్చు అన్న ఇండికేషన్స్ ఈ సెమీ ఫైనల్స్ ఇచ్చేశాయి.
అయితే బీజేపీ విషయంలో ఒకసారి డైరెక్ట్ గా 2019లో విమర్శించి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని దేశమంతా తిరిగి చేతులు కాల్చుకున్న టీడీపీ ఇపుడు ఇండైరెక్ట్ గా ఎంత చేసినా తెలియాల్సిన వారికి తెలిసిపోయింది. బీజేపీ కి ఇవన్నీ తెలవదు అనుకుంటే పొరపాటే. మరి ఏపీలో బీజేపీ టీడీపీని దగ్గరకు రానిస్తుందా అన్నది పెద్ద డౌట్ ట.
అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి జరగవచ్చు అన్నది మరో మాట. అయితే బీజేపీ తాను గా రాదు వచ్చినా డిమాండ్ వేరేగా ఉంటుంది. సో ఈ పొత్తుల ఎత్తులు అన్నీ ఏపీలో ఎలా సాగుతాయో ఏమో. సో టీడీపీకి ఇపుడు తెలంగాణా గెలుపు అనందమేనా అంటే గట్టిగా బయటకు చెప్పలేని స్థితి. అదీ సంగతి.