షర్మిలను విమర్శిస్తే పదవులు ఊడతాయంతే !

ఇందులో పద్మశ్రీ రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు.

Update: 2024-07-18 03:40 GMT

వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిలకు కేంద్ర కాంగ్రెస్ వద్ద ఉన్న పలుకుబడి ఎంతో ఒక్క సంఘటనతో తెలిసి వచ్చింది. ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సహా మొత్తం నలుగురిని తొలగిస్తూ ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం తాజాగా చర్యలు తీసుకుంది.

దాంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్, మస్తాన్ వలీల పదవులు పోయాయి. ఇందులో పద్మశ్రీ రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు. పద్మశ్రీ అయితే హై కమాండ్ ఇచ్చిన ఎన్నికల ఫండ్స్ సరిగ్గా ఖర్చు చేయలేదని షర్మిల మీద తీవ్ర ఆరోపణలు చేసారు.

ఆమె పనితీరుని సైతం ప్రశ్నించారు. అలాగే రాకేష్ రెడ్డి కూడా షర్మిల వల్ల ఉపయోగం లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో వారి మీద షర్మిల కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో సీరియస్ అయింది. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం దీని మీద చర్యలు తీసుకుంది. అలా షర్మిలను విమర్శించినందుకు ఉన్న పోస్టులు పోయయాని అంటున్నారు.

ఈ చర్యతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలు తాము పూర్తిగా షర్మిల వైపే అని స్పష్టం చేసినట్లు అయింది. ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే పనికి షర్మిల మాత్రమే తగిన నేత అని కాంగ్రెస్ నమ్ముతోంది. వైసీపీ ఓటమి పాలు కావడం అన్న తొలి టార్గెట్ షర్మిల ద్వారా సక్సెస్ ఫుల్ గా ఆ పార్టీ సాధించింది. ఇక వైసీపీ నుంచి భారీ ఎత్తున నాయకులను తీసుకోవడంతో పాటు వివిధ జిల్లాలలో కాంగ్రెస్ ని పటిష్టం చేసే కార్యక్రమం అంతా షర్మిల ద్వారానే చేయాలని చూస్తోంది

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వైఎస్సార్ జయంతి వేడుకలను ఏపీలో కాంగ్రెస్ నాయకత్వంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ దానికి తెలంగాణా సీఎం సహా కీలక నేతలను పంపించింది. అలా షర్మిల ఇమేజ్ ని జనంలో పెంచుతూ ఆమె మాత్రమే వైఎస్సార్ వారసురాలు అని రుజువు చేస్తూ ముందుకు సాగుతోంది.

కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అండదండలతోనే షర్మిల ఏపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఉన్న పద్మశ్రీ రాకేష్ రెడ్డి ఈ విషయం ఎంత మేరకు గ్రహించారో తెలియదు, వారు కాంగ్రెస్ కల్చర్ లో భాగంగా అనుకుని పార్టీ ఓడిన తరువాత పీసీసీ చీఫ్ మీద విమర్శలు చేస్తే ఆమెను మారుస్తారు అని భావించారు. కానీ వారి పదవులే పోయాయని అంటున్నారు. ఒక విధంగా ఇది మిగిలిన కాంగ్రెస్ నేతలకు కూడా హెచ్చరిక అంటున్నారు. షర్మిల ఏపీ వరకూ సుప్రీం అని కేంద్ర కాంగ్రెస్ గట్టిగానే చెప్పినట్లు అయింది.

Tags:    

Similar News