కాంగ్రెస్, బీజేపీ.. కామెడీ పాల‌వ‌డం త‌ప్ప మ‌రేం లేదుగా

వ‌లస వ‌చ్చే ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నేతల కోసం సెకండ్ లిస్టును, కొన్ని సీట్లు పెండింగ్లో పెట్టాలని కాంగ్రెస్ , బీజేపీలు ఎదురుచూస్తుండ‌టం ఆ పార్టీలోని బ‌ల‌మైన‌, ఆశావాహ నేత‌ల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది.

Update: 2023-10-27 04:06 GMT

రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు ఏ విధంగా ఉండాలి? ఖ‌చ్చితంగా అదే స్థాయిలో అదిరిపోవాలి. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్, బీజేపీ తీరు న‌వ్వుల పాల‌య్యేలా ఉంద‌ని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో టికెట్రాని లీడర్లను, అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉండ‌గా... అధికార బీఆర్ఎస్‌, అసంతృప్త కాంగ్రెస్ నేత‌ల‌కు కాషాయ కండువా క‌ప్పుదామ‌ని క‌మ‌లం పార్టీ ఎదురుచూస్తోంది. మొత్తంగా ఇరు పార్టీలు జాబితా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఆ పార్టీ శ్రేణులే సెటైర్లు వేసుకుంటున్నారు.

ఇటీవ‌లి కాలంలో ఊహించ‌ని రీతిలో బ‌ల‌ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ల విష‌యంలో తెగ నాన్చుడు దోర‌ణి అవ‌లంభిస్తోంది. టికెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నప్ప‌టికీ చ‌ర్చ‌లు తెమ‌ల‌డం లేద‌ని అంటున్నారు. 64 సీట్లను పెండింగ్ లో పెట్టిన ఆ పార్టీ.. వాటిలో ఎవరెవరిని పోటీలోకి దింపాలనే దానిపై చర్చలు జరుపుతూనే ఉంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరే అవకాశమున్న స్థానాలను పెండింగ్లో పెట్టే చాన్స్ ఉన్నట్లు చెప్తున్న‌ప్ప‌టికీ ఆ కార‌ణం వ‌ల్ల మిగ‌తా చోట్ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఏంట‌ని హ‌స్తం నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆఖరి నిమిషం వరకు కసరత్తు చేసే పని పెట్టుకున్నాయని హుందాగా విశ్లేషించిన‌ప్ప‌టికీ పూర్తిగా అవ‌కాశ‌వాదం, దింపుడు క‌ళ్లెం ఆశ‌తోనే ఉన్నాయ‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించటమే తమ వ్యూహమని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిషన్రెడ్డి ప్రకటించిన‌ప్ప‌టికీ, ఇతర పార్టీల్లో టికెట్ల పంపిణీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి... ఆ అసంతృప్తుల‌కు గాలం వేసి ఆ తర్వాత తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నేతలను, అసంతృప్తులను చేర్చుకొని ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా స్ప‌ష్టం అవుతోంద‌ని అంటున్నారు.

వ‌లస వ‌చ్చే ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నేతల కోసం సెకండ్ లిస్టును, కొన్ని సీట్లు పెండింగ్లో పెట్టాలని కాంగ్రెస్ , బీజేపీలు ఎదురుచూస్తుండ‌టం ఆ పార్టీలోని బ‌ల‌మైన‌, ఆశావాహ నేత‌ల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ ఓ రేంజ్‌లో ముందుకు వెళ్తోంటే తాము మాత్రం ఇంకా ఎవ‌రికి టికెట్ ద‌క్క‌నుంద‌నే ఊగిస‌లాట‌లోనే ఉన్నామ‌ని ప‌లువురు కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో వాపోతున్నారు. మీ అభ్య‌ర్థి ఎవ‌రంటే జ‌వాబు చెప్ప‌లేకుండా న‌వ్వుల పాలు అయిపోతున్నామంటూ బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు సెటైర్లు వేసుకుంటున్నారు.

Tags:    

Similar News