తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు... రేవంత్ సంచలన నిర్ణయాలు!
దీంతో.. కేసీఆర్ ముద్రను తొలగించే ప్రయత్నాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ల తర్వాత ప్రభుత్వమే కాదు.. చాలా మారుతున్నాయనే చర్చ బలంగా జరుగుతుంది. సుమారు దశాబ్ధ కాలం తర్వాత బీఆరెస్స్ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అంతేకాదు... ఈ సమయంలో సంచలన మార్పులకు తెరలేపారు. దీంతో.. కేసీఆర్ ముద్రను తొలగించే ప్రయత్నాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు.
అవును... తెలంగాణలో దశాబ్ధ కాలం తర్వాత ప్రభుత్వం మాత్రమే మారడం కాదు.. చాలా మార్పులకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ప్రధానంగా గతంలో ఆయన.. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చేసిన శపథం నేరవేర్పు దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. తాజాగా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో కేసీఆర్ సర్కార్ గతంలో ఏర్పాటు చేసిన చిహ్నాలను, తెలంగాణ గుర్తులను రేవంత్ సర్కార్ మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా... తెలంగాణ తల్లిగా కేసీఆర్ గుర్తించిన ప్రతిమతో పాటు అధికారిక చిహ్నంలో రేవంత్ సర్కార్ మార్పులు, చేర్పులను చేస్తోంది. ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో... ప్రస్తుతం తెలంగాణ తల్లిగా కీర్తించబడుతోన్న విగ్రహం దొరసానిలా ఉందని గతంలో రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు! దీంతో... తెలంగాణ తల్లికి మరో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఇదే సమయంలో... రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ చిత్రకారుడు రుద్ర రాజేశ్ తో చర్చలు జరిపారు. ప్రధానంగా చిహ్నంలో రాచరికపు ఆనవాళ్ళు లేకుండా పలు సూచనలు చేశారని తెలుస్తుంది.
ఇక తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రాసిన "జయ జయహే తెలంగాణ"కు స్వయంగా దగ్గరుండి ఎంఎం కీరవాణితో స్వరకల్పన చేయిస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే వాహనాలు రిజిస్ట్రేషన్ కోడ్, ప్రభుత్వ సంస్థల పేర్లను "టీఎస్" నుంచి "టీజీ"కి మార్పించారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను బీఆరెస్స్ కీర్తిస్తుండటంతో... జయశంకర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు!
ఇలా ప్రతీ విషయంలోనూ రేవంత్ సర్కార్... పలు మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా... తెలంగాణలో కేసీఆర్ ముద్రను లేకుండా చేసే పనిలో భాగంగానే ఈ మార్పులు, నిర్ణయాలు అనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి.