హైకమాండ్ వార్నింగ్‌తో ఆ మంత్రుల ఉరుకులు పరుగులు!
సార్వత్రిక ఎన్నికల వేడితో దేశమంతా పొలిటికల్ హీట్ రగులుకుంది.
సార్వత్రిక ఎన్నికల వేడితో దేశమంతా పొలిటికల్ హీట్ రగులుకుంది. నాలుగో విడతలో భాగంగా తెలంగాణలో మే 13న పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్‌కు ఇంకా మూడు రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ 15కి తగ్గకుండా సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది. కానీ కొంతమంది మంత్రులు మాత్రం ఈ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారని తెలిసింది. వీళ్లపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సీరియస్ అయినట్లు సమాచారం. పదవులు పీకేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడీ మంత్రులు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు టాక్.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలను హైకమాండ్‌కు బహుమతిగా ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర నేతలు కూడా ఓట్ల వేటలో సాగుతున్నారు. కానీ మంత్రుల్లో కొంతమంది మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా ఉన్నారని సమాచారం. ఆయా లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా మంత్రులను నియమించిన హైకమాండ్ ఎప్పటికప్పుడూ వీళ్ల పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్‌కు మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై అలసత్వం వద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులను సమన్వయం చేయడంలో మహేశ్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. కొంతమంది మంత్రుల వ్యవహార శైలి మారకపోతే వేటు తప్పదని ఆయన సీరియస్ అయ్యారని తెలిసింది. అలాగే పని చేసే ఎమ్మెల్యేలకే పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పరుగులు పెడుతున్నారని టాక్.