పరువు పోగొట్టుకునే మాటలు అవసరమా చింతా?

తాజాగా నెల్లూరు జిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

Update: 2023-07-23 04:37 GMT

రాజకీయాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన నేతలు కొందరిని కాలం సవాలుగా మారుతుంటుంది. ఇలాంటి వేళ.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వారు.. తమ ప్రభ మసకబారే సమయాన్ని గుర్తించి.. తెలివిగా వ్యవహరిస్తే.. తెర మరుగు కాకుండా ఉండే వీలుంటుంది. కానీ.. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించే విషయంలో చాలామంది నేతలు తప్పుల మీద తప్పులు చేస్తుంటారు.

ఆ కోవలోకే వస్తారు మాజీ ఎంపీ చింతా మోహన్. కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగిన కాలంలో తిరుపతి ఎంపీగా చింతా మోహన్ కు తిరుగు ఉండేది కాదు. ఆయన మీద ఎన్ని ఆరోపణలు.. విమర్శలు ఉన్నా.. ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఎవరూ చెక్ పెట్టలేని పరిస్థితి ఉండేది. అలాంటి చింతా మోహన్.. రాజకీయంగా తప్పుల మీద తప్పులు చేయటంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావటమే కాదు.. ఆయన ప్రభ మసకబారింది.

ఉన్న కొద్దిపాటి గౌరవ మర్యాదల్ని దెబ్బ తీసుకునేలా ఆయన మాటలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వయసు మీద పడిన తర్వాత తెలివి తగ్గుతుందని చెబుతారని.. చింతా మోహన్ మాటలు అలానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి పది సీట్లు కూడా రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందన్న ఆయన.. దానికి తగ్గ ఆధారాల్ని చూపించలేదు. ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీ.. మైనార్టీలు జగన్ కు ఓటు వేయరన్న ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటాన్ని తప్పు పట్టారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు వారికి నచ్చిన విధానంలో వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. అలాంటప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది కరెక్టు? అన్నది తేల్చటం అంత తేలికైన విషయం కాదు.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్ల సంఖ్య మీద చింతా చేసిన వ్యాఖ్యలు.. రానున్న రోజుల్లో ఆయన ఇమేజ్ ను దెబ్బ తీయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషణలు చేసేటప్పుడు.. అంచనాల్ని వినిపించే ముందు.. తమ వద్ద ఉన్న ఆధారాల్ని ప్రస్తావిస్తూ చేసే.. బలంగా ఉంటుంది. అంతే తప్పించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఉన్న కొద్దిపాటి మర్యాద మిస్ అవుతుందన్న విషయాన్ని చింతా గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News