కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారు: కడియం, కేటీఆర్ ఒకటే మాట
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని వ్యాఖ్యానించారు.
బీఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు(బీఆర్ ఎస్) 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. అన్నీ గనిస్తున్నామని.. అధికారంలోకి వచ్చే ఛాన్స్‌పైనా దృష్టి పెడుతున్నామని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని వ్యాఖ్యానించారు.
‘కేసీఆర్ సింహంలా బయటకు వస్తారు. సమయం చెప్పలేం కానీ, ఆయన బయటకు రావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు .. మా మిత్ర పక్షం ఎంఐఎం పార్టీకి 8 సీట్లు.. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ సీట్లను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్తులను కూడా కలిపితే 56 సీట్లవుతాయి. వీరంతా మాకే మద్దతుగా ఉన్నారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే... వేటకు సిద్ధమైనట్టే. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుంది. ఎవరూ అధైర్యపడొద్దు’’ అని కడియం వ్యాఖ్యానించారు.
కేటీఆర్ నోట..
మరోవైపు.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ అగ్రనేత కేటీఆర్ నోట కూడా దాదాపు ఇదే మాట వినిపించింది. కాంగ్రెస్ పార్టీలో నిరాశలో ఉన్ననేతలు కూడా తనకు మెసేజ్‌లు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం, నిరాశ పడాల్సిన అవసరం లేదు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ, పోరాటాలు మాకేం కొత్తకాదు. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల గొంతుకై మాట్లాడుతాం. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు, దానికి భయపడాల్సిన అవసరంలేదు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వదులుకోరు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.