అందరు కాంగ్రెస్ మీద పడేటోళ్లే.. బీజేపీని ఒక్క మాట అనరేం?
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలుగుప్రజలకు మాత్రం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే ఆసక్తి ఎక్కువ. జాతీయస్థాయిలో చూస్తే.. మిగిలిన నాలుగింటిలో మధ్యప్రదేశ్.. రాజస్థాన్ మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఛత్తీస్ గఢ్ పైనా కొంత ఆసక్తి ఉంటుంది కానీ.. మిజోరం మీద పెద్ద ఫోకస్ పడే పరిస్థితి లేదు.
బీజేపీ.. కాంగ్రెస్ కు ధీటుగా జాతీయ పార్టీ పెడుతున్నట్లుగా డాబు ప్రకటన చేసి.. తనకు తెలంగాణలో తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ పార్టీ తెలంగాణలో ఘోరంగా ఓడిపోవటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్ పోగొట్టుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం గెలుపొందటంతో ఆ పార్టీకి పరువు దక్కినట్లైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వాధినేతను ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అసాధారణ జాప్యం చేయటం.. ఎందుకు అధికారాన్ని కట్టబెట్టామా? అన్నట్లుగా ప్రజలు అనుకునే వరకు తెచ్చుకుంటారు. ఈ అపప్రదకు భిన్నంగా తెలంగాణ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందనే చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై అధికార ప్రకటన ఇచ్చేసింది. అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించిందన్న విమర్శ వినిపిస్తోంది.
అయితే.. మూడురాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన బీజేపీ ఇప్పటివరకు తన ముఖ్యమంత్రులను ప్రకటించింది లేదు. ఆ దిశగా చర్చలు జరుగుతున్నా.. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎవరన్న దానిపై క్లారిటీ రాని పరిస్థితి. ఈ లెక్కన చూస్తే.. కాంగ్రెస్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుందని చెప్పాలి. అయినప్పటికీ.. కాంగ్రెస్ ను ఆడిపోసుకుంటున్న వైనమే కనిపిస్తుంది. ఇదంతా చూస్తే.. బీజేపీ ఏం చేసినా పెద్దగా విమర్శలు ఎదురుకానప్పటికీ.. కీలక నిర్ణయాల్ని వేగంగా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.