ఏం చూసి కాంగ్రెస్ వెంట పరిగెట్టాలి? పొలిటికల్ ప్రశ్న!
ఔను.. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకులు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు
ఔను.. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకులు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఏం చూసి కాంగ్రెస్ వెంట పరుగులు పెట్టాలి? తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలకు ఇవ్వడంతో ఇక, పాత నేతలు పరుగులు పెడతారని.. వైసీపీ నుంచి కూడా కాంగ్రెస్ తరఫున పదవులు పొందిన వారు వచ్చేస్తారని.. కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు.. తీసుకురావాలన్న టార్గెట్లు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఏం చూసి కాంగ్రెస్ వెంట పరుగులు పెట్టాలనేది కీలక నేతల ప్రశ్న. ఎందుకంటే.. 2014కు ముందు ఏపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు విభజన వద్దని మొత్తుకున్నారు. వారి మాటను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. అంతేకాదు.. పోనీ విభజనహామీల్లో అయినా.. ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారా? అంటే అది కూడా లేదు. కేవలం మాట మాత్రంగా చెప్పి ఊరుకున్నారు. దీనిపై పారాడింది కూడా లేదు. వస్తే ఇస్తామని అనడం తప్ప.. మోడీని నిగ్గదీసి అడిగిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కనిపించడం లేదు.
మరోవైపు..కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో వదిలించుకున్నారు. ఒకప్పుడు గ్రామీణ స్థాయలో కాంగ్రెస్ పేరు మార్మోగింది. పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు కూడా ఉండేది. అయితే.. ఇవన్నీ విభజన తోనే పోయాయి ఇక, ఇప్పుడు పగ్గాలు చేపట్టే షర్మిల దీనిని కొలిక్కి తెస్తారన్న కాంగ్రెస్‌పార్టీలో అయితే ఉండొచ్చేమో.. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులకు మాత్రం ఏమాత్రం లేదు. కేవలం జగన్ కోసం.. అన్నట్టుగా నే ఈ ప్రయోగం చేస్తున్నారనే భావన పెరుగుతోంది.
ఇది కాంగ్రెస్‌కు మరింత కష్టం తెస్తుందే తప్ప మేలు చేయబోదని అంటున్నారు. పైగా ఇప్పుడున్న వైసీపీ నాయకులు కావొచ్చు.. ఇతర పార్టీల్లోని కాంగ్రెస్ నాయకులు కావొచ్చు.. ఎంతో కొంత సేఫ్ సైడ్‌లోనే ఉన్నారు. ఇలాంటి వారు ఇప్పుడు విఫలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్న షర్మిలను చూసి కాంగ్రెస్‌లోకి పరుగులు పెడతారంటే సందేహమేనని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. ఏం చూసి కాంగ్రెస్‌లోకి పరుగులు పెట్టాలనే ప్రశ్నకు సమాధానం అయితే లభించడం లేదని అంటున్నారు పరిశీలకులు.