కాంగ్రెస్ మారదా...? ఇండియా కూటమి బీటలు!

కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోకడలకు విసిగి ఇండియా కూటమి నేతలు దూరం పాటిస్తున్నారు. దాంతో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమి చీలికలతో బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2023-12-05 09:06 GMT

కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోకడలకు విసిగి ఇండియా కూటమి నేతలు దూరం పాటిస్తున్నారు. దాంతో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమి చీలికలతో బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల విజయంతో గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ లో పెద్దన్న పోకడలు స్పష్టంగా కనిపించాయని ఇండియా కూటమి భాగస్వాములు మండిపోతున్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే ఇండియా కూటమి ఉందా దాని కార్యకలాపాలు నిరంతం కొనసాగాలి కదా అంటూ ఆ మధ్యన బీహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగానే ప్రశ్నించారు. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాతనే ఇండియా కూటమి మీటింగ్స్ అన్న మాటకే కట్టుబడి కాంగ్రెస్ కూటమిని పక్కన పెట్టేసింది. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు మీటింగ్ అంటే పొత్తుల కోసం పార్టీలు వస్తాయని వారికి సీట్లు కేటాయించే విషయంలో ఇబ్బందులు ఉంటాయనే కాంగ్రెస్ అలా తెలివిగా చేసిందని ఇండియా కూటమి నేతలు అనుమానిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ లో పోటీ చేస్తామని తమకు పొత్తులలో సీట్లు ఎక్కువ ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ విన్నపాన్ని పక్కన పెట్టడంతో ఆయన ఫైర్ అయ్యారు.

ఇలా అయితే లోక్ సభ ఎన్నికల్లో మా దారి మేము చూసుకుంటామని కూడా హెచ్చరించారు. అదే తీరులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ పోకడల మీద విమర్శలు గుప్పించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ హై కమాండ్ పెద్దన్న పోకడలను విభేదిస్తూ వస్తున్నారు.

ఆధిపత్య ధోరణి ఉండకుండా అంతా కలసి ఉండాలని ఇండియా కూటమి నేతలు కోరుతూంటే కాంగ్రెస్ మాత్రం తనదే పై చేయి అన్నట్లుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఇపుడు ఇండియా కూటమి మీటింగ్ కి టైం చూసి విపక్షాలు డుమ్మా కొడుతున్నాయని అంటున్నారు. ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి మీటింగ్ కి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, అలాగే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ డుమ్మా కొడుతున్నారు అని అంటున్నారు.

వీరంతా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్వవహరించిన తీరుకు గుస్సా అవుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఇండియా కూటమి పార్టీలను సైడ్ చేసి కాంగ్రెస్ తానుగా పోటీ చేసింది. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. ఇక దీనికంటే ముందు కర్నాటక హిమాచల్ ప్రదేశ్ లలో గెలవగానే కాంగ్రెస్ కి ధీమా పెరిగి కూటమిలోని పార్టీలను నిర్లక్ష్యం చేసిందని అంటున్నారు.

ఇపుడు కాంగ్రెస్ కి ఉత్తరాదిన ఘోర ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో సంభవించింది. దాంతో కాంగ్రెస్ ఇండియా కూటమి మీటింగ్ కి అర్జెంట్ గా పిలుపు ఇస్తే విపక్షాలు ఇపుడు చాన్స్ తీసుకుంటున్నాయి. మరి కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోదా ఎప్పటికీ ఇంతేనా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తీరు మార్చుకుంటేనే ఇండియా కూటమి బలపడుతుందని అలా కాకుండా పెద్దన్న పోకడలు పోతే మాత్రం కూటమి ముక్కలు అవుతుందని ఎవరి దారి వారు చూస్తుకుంటారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఈ మీటింగ్ తరువాత అయినా తన వైఖరిలో మార్పు తెచ్చుకుంటుందా అన్నదే చూడాల్సి ఉంది మరి.

Tags:    

Similar News