రేవంత్‌కు కాంగ్రెస్ పెద్దలు షాక్‌లు ఇస్తున్నారుగా!
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి బరిలో దిగనున్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తన మార్క్ వేసుకుంటూ ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి అదే సమయంలో ఊహించని వివాదాల్లో సైతం చిక్కుకుంటున్నారు. కాంగ్రెస్‌లోని సీనియర్ల నుంచి ఎదురవుతున్న కామెంట్లు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు... రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు వంటివి ఇందులో భాగం. అయితే, తాజాగా ఢిల్లీ పెద్దలు సైతం రేవంత్‌కు ఓ షాక్ ఇచ్చారని అంటున్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయింపు ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి బరిలో దిగనున్నారు. సుప్రసిద్ధ రాజకీయవేత్త పీ జనార్దన్ రెడ్డి తనయగా విజయారెడ్డికి రాజకీయాల్లో గుర్తింపు ఉండటమే కాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుంది.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఇదే నియోజకర్గం నుంచి పోటీ చేయగా బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. అయితే ఆమె ఓట్లు సంపాదించుకోవడమే కాకుండా నియోజకవర్గంలో పట్టు కూడా కలిగి ఉన్నారు. అనంతరం విజయారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు టికెట్ సంపాదించారు.
అయితే, ఈ పరిణామం కేవలం విజయారెడ్డి కోణంలోనే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోణంలోనూ చూడాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తున్న రోహిన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సన్నిహితుడనే పేరుంది. ఖైరతాబాద్ నుంచి ఆయనకు అవకాశం దక్కుతుందనే వార్తలు వినిపించాయి. అయితే, రోహిన్ రెడ్డికి ఆశాభంగం కలిగిస్తూ ఆయనకు అంబర్‌పేట్ టికెట్ కేటాయించారు. ఇది రేవంత్ రెడ్డికి కలిగిన షాక్ అని అంటున్నారు.
రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేసేలా కాంగ్రెస్ పెద్దలు విజయారెడ్డి పేరు ఖరారు చేసి రోహిన్ రెడ్డికి టికెట్ కేటాయించారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి తన అనుచరులకే టికెట్లు ఇప్పించుకుంటున్నారని, సీనియర్లు , పార్టీకి సేవ చేసిన వారికి అవకాశాలు దక్కడం లేదని కాంగ్రెస్‌లోని పలువురు నేతలు చెప్పిన మాటలను గమనించిన అధిష్టానం విజయారెడ్డికి చాన్స్ ఇచ్చి ... రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు.