ఏపీలో మూడుకి మూడుందా...కాంగ్రెస్ కి చోటుందా...!?

రెండు బలమైన రాజకీయ పార్టీల మధ్య మూడవ పార్టీకి ఎపుడూ చోటు దొరకదు. దేశంలో చూసుకుంటే అదే ఎక్కడైనా జరుగుతోంది.

Update: 2024-01-21 11:41 GMT

రెండు బలమైన రాజకీయ పార్టీల మధ్య మూడవ పార్టీకి ఎపుడూ చోటు దొరకదు. దేశంలో చూసుకుంటే అదే ఎక్కడైనా జరుగుతోంది. తమిళనాడు లో అలాంటి వాతావరణమే ఉంది. కర్నాటకలో కూడా సేమ్ సీన్. కేరళలో అంతే. నిన్న కాక మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో సైతం రెండు బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్యనే పోరు సాగింది.


ఈ మధ్యలో బీజేపీ ఎదగాలని చూసినా నలిగిపోయింది. రెండే పార్టీల మధ్య ఎందుకు పోరు జరుగుతుంది, మూడవ పార్టీకి ఎందుకు చాన్స్ రాదు అంటే దానికి కారణం ఉంది. భారతీయ ఓటరు తన ఓటు పొల్లు పోకూడదని అనుకుంటాడు. తన ఓటు చెల్లాలని చూస్తాడు. అందుకే గెలుపు గుర్రాల మీదనే పందెం కాసినట్లుగా బలమైన పార్టీల వైపే ఓటర్ల చూపు ఉంటుంది.

అలా ఓటర్లు పోలరైజ్ అయిపోతారు. ఏపీలో కూడా రాజకీయంగా చూస్తే పోలరైజేషన్ జరిగిపోయింది. ఎందుకంటే ఎన్నికలు కేవలం రెండు నెలల వ్యవధికి వచ్చేశాయి. ప్రజలు తమ భావాలను అయితే బయటకు చెప్పకపోవచ్చు కానీ వారి మనసులలో అయితే అభిప్రాయం బలంగా ఏర్పడింది అనే చెప్పాలి

వైసీపీ అధికార పార్టీగా ఉంది. ఆ పార్టీ అయిదేళ్ళ పాలన మీదనే 2024 ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ పనితీరు బాగుంది అనుకునే వారు వైసీపీకి ఓటు వేస్తారు. కాదు బాగాలేదు అనుకున్న వారు కచ్చితంగా వైసీపీని ఓడించి మరో పార్టీని గెలిపించాలని చూస్తారు. అలా వారు వెతుకుతున్నపుడు కచ్చితంగా తమ ఓట్లతో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది బలంగా ఉంటుందో ఆ వైపే చూపులు వెళ్తాయి.

ఏపీలో వైసీపీకి ధీటైన పక్షంగా టీడీపీ ఉంది. ఆ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ రెండూ కూటమిగా ఏర్పడ్డాయి. ఇంకా ఈ కూటమిలోకి బీజేపీ రావచ్చు. లేదా కమ్యూనిస్టులు కూడా వచ్చి చేరవచ్చు. మొత్తానికి వైసీపీకి ఆల్టర్నేషన్ అంటే జనాలు చూసేది టీడీపీ కూటమి వైపే. మరి ఈ సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి మొత్తానికి మొత్తం జాతకం మార్చేస్తారు అనుకుంటే పొరపాటే అవుతుంది.

కాంగ్రెస్ పరిస్థితి కేవలం రెండు నెలలలో మారిపోదు. ఎన్టీయార్ అంతటి వారు తన పార్టీని ఏపీలో గెలిపించాలంటే రాత్రీ పగలూ తేడా లేకుండా తొమ్మిది నెలల పాటు తిరిగారు. అపుడు కాంగ్రెస్ కి వేరే ఆల్టర్నేషన్ లేదు కాబట్టి టీడీపీని ఆదరించారు. అదే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టే సమయానికి అనేక పార్టీలు ఉన్నాయి కాబట్టే మూడవ ఆల్టర్నేషన్ అన్నది కుదరలేదు.

మరి గత అనుభవాలు కళ్ళ ముందు ఉండగా ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందా అంటే ఆలోచించాల్సి ఉంటుంది. షర్మిలకు టైం కూడా తక్కువగా ఉంది. నిజానికి ఆమె 2021లో తెలంగాణాలో పార్టీ పెట్టకుండా ఏపీలో పెట్టి ఉంటే కచ్చితంగా ఈ పాటికి కాంగ్రెస్ గట్టి రాజకీయ పక్షంగా నిలిచి ఉండేది.

కానీ ఇపుడు సమయం మించి పోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ మీద విమర్శలు ఆమె ఎన్ని చేసినా లేక ఎంతలా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచినా అది చివరికి టీడీపీ జనసేన కూటమికే బలం చేకూరుస్తుంది అన్నది ఒక విశ్లేషణగా ఉంది. బలం లేని మూడవ పార్టీలు చేసే ప్రచారం ఒక రకంగా బలంగా ఉంటూ ధీటైన పార్టీలుగా ఉన్న వారికే మేలు చేస్తాయి.

తెలంగాణాలో బీజేపీ చేసిన బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం అంతా చివరికి కాంగ్రెస్ కి ప్లస్ గా మారింది. అలా ఇపుడు చూస్తే కనుక మూడవ పార్టీ వైపు జనాల మూడ్ ఉందా అంటే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాత్రం అలాంటి సీన్ అయితే కనిపించడంలేదు.

దాంతో కాంగ్రెస్ కి చోటు పెద్దగా ఉండకపోవచ్చు అన్నది ఒక విశ్లేషణ. అయితే అధికార పార్టీ మీద వ్యతిరేకతను పోగు చేయడంలో మాత్రం షర్మిల పర్యటనలు, ఆమె ప్రసంగాలు అన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పక తప్పదు. అలా ఏపీలో కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో పెద్దగా అద్భుతాలు అయితే క్రియేట్ చేయలేదని అంటున్నారు.

Tags:    

Similar News