కేసీఆర్ కేబినెట్ భేటీపై కాంగ్రెస్ వెటకారం... 4 అంశాలపై సీఈవోకు ఫిర్యాదు

ఈ మేరకు ఈసీ కార్యాలయానికి వెళ్లిన నేతలు... నాలుగు అంశాలను ప్రస్థావిస్తూ బీఆరెస్స్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

Update: 2023-12-02 09:07 GMT

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో అధికారంలోకి రాబోయేది తామే అని వారంతా బలంగా నమ్ముతున్నట్లుంది. దీంతో... తాను కుర్చీ దిగిపోయేలోపు తెరవెనుక కేసీఆర్ కొన్ని పనులు చక్కబెడుతున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగపరుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

అవును... ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని వికాస్‌ రాజ్‌ ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు ఈసీ కార్యాలయానికి వెళ్లిన నేతలు... నాలుగు అంశాలను ప్రస్థావిస్తూ బీఆరెస్స్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రధానంగా రైతుబంధు నిధులు దారిమళ్లించకుండా చూడాలని.. ఎసైండ్ భూముల రికార్డులు తారుమారవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఉత్తం కుమార్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ తదితర కాంగ్రెస్ నేతలు శనివారం ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఈ సందర్భంగా... రైతుబంధు నిధులను గుత్తేదార్లకు చెల్లించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. ఈసీ ఆఫీసులో సీఈవో ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తం కుమార్ రెడ్డి... ఈ ఫిర్యాదులు, అందుకు సంబంధించిన కారణాలపై స్పందించారు.

ఇందులో భాగంగా... రూ. 6వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆరెస్స్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. రైతుబంధు నిధులను దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో... హైదరాబాద్‌ లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ కు కుట్ర జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఆ రాష్ట్ర సీఈవోకు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో... అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయకుండా చూడాలని.. ఆ భూముల రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం తమవద్ద ఉందని తెలిపారు! ఈ క్రమంలో ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని.. 4 అంశాలపై వికాస్‌ రాజ్‌ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇదే సమయంలో... ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు తీసుకుంటారని తెలిపిన ఉత్తం కుమార్ రెడ్డి... ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... 4వ తేదీన కేసీఆర్‌ కేబినెట్‌ మీటింగ్‌ విషయంపైనా ఉత్తం స్పందించారు.

ఇందులో భాగంగా కేసీఆర్ 4వ తేదీన కేబినెట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటుచేశారో తమకు తెలియదు కానీ... "రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చు" అని అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల వెటకారం అలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News