కాంగ్రెస్ దయాకర్‌కి.. గవర్నర్ కాంగ్రెస్‌కి.. షాకులమీద షాకులు!
తాజాగా ఆయన పేరును జాబితా నుంచి తొలగించి మహేష్‌కుమార్ గౌడ్‌కు పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్సీ స్థానం అభ్యర్తిగా ప్రకటించింది.
తెలంగాణలో బుధవారం రాజకీయాలు వెంటనే వెంటనే యూటర్న్‌లు తీసుకున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, వారిని నామినేషన్లకు కూడా రెడీ అవ్వాలంటూ.. మంగళవారం ఆదేశించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిలో ఒకరికి షాక్ ఇచ్చింది. వాస్తవానికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలో ఉండడంతో కాంగ్రెస్‌కే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయనేది వాస్తవం. దీంతో ఆ ఇద్దరు కూడా రెడీ అయ్యారు. వారే ఒకరు అద్దంకి దయాకర్. మరొకరు బల్మూరు వెంకట్. అయితే, 24 గంటలు గడిచే సరికి అద్దంకి దయాకర్‌కుకాంగ్రెస్ షాక్ ఇచ్చింది.
తాజాగా ఆయన పేరును జాబితా నుంచి తొలగించి మహేష్‌కుమార్ గౌడ్‌కు పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్సీ స్థానం అభ్యర్తిగా ప్రకటించింది. దీంతో ఈ నెల 29న జరగనున్న ఎన్నికల్లో బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అయితే.. అద్దంకి దయాకర్‌కు ఎందుకు పార్టీ హ్యాండిచ్చిందనేది ఆసక్తిగా మారింది. ఇక, అద్దంకి దయాకర్ విషయంపై పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు.. గవర్నర్ కోటాలో ఉన్న రెండు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ కోటాలో దయాకర్‌ను పంపుతారని అంటున్నారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అద్దంకి దయాకర్‌ను ఎందుకు జాబితా నుంచి తొలగించిందనేది కారణం వెల్లడించలేదు. కాగా, అసలు పార్టీ అద్దంకిని పరిగణనలోకి తీసుకున్నట్టు తమకు సమాచారమే లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా.. అద్దంకి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లినట్టు అయింది.
గవర్నర్ షాక్ ఇదీ..
అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా నుంచి తొలగించిన కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగాగవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నుంచి భారీ షాక్ తగిలింది. త్వరలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితా రావాల్సి ఉంది. దీనిలో రెండు స్థానాలు కూడా కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. అయితే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితా ప్రకటనకు గవర్నర్ మోకాలడ్డారు. ఈ జాబితాను ప్రకటించ వద్దని తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఇలా.. కాంగ్రెస్ అద్దంకికి షాకిస్తే.. గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు.