ప్రతి అడుగులోనూ సెంటిమెంట్.. టీ కాంగ్రెస్ వ్యూహమిదేనా?
రాజకీయాల్లోభావోద్వేగానికి మించిన అస్త్రం మరొకటి ఉండదు. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని బయటకు తీసే వీలుండదు.
రాజకీయాల్లోభావోద్వేగానికి మించిన అస్త్రం మరొకటి ఉండదు. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని బయటకు తీసే వీలుండదు. కానీ.. కొన్ని సందర్భాల్లో ఆ అస్త్రాన్ని తీస్తే వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గుర్తించినట్లుగా ఉంది. భావోద్వేగాన్ని ఆయుధంగా చేసుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు.. అదే ఆయుధంతో సరైన బదులు ఇవ్వాలన్నట్లుగా కాంగ్రెస్ ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది.
దీనికి తగ్గట్లే.. ఈసారి ఎన్నికల ప్రచారం మొదలుకొని.. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ వేళలోనే.. ఈ తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను చూసినప్పుడు కాంగ్రెస్ అధిక్యత స్పష్టంగా కనిపిస్తుండటం తెలిసిందే. అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్న వేళ.. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడున్న ప్రశ్న సహజంగా తెర మీదకు వస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తున్న సమాధానం ఆసక్తికరంగానే కాదు..వ్యూహాత్మకంగా వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నప్పటికీ.. తాము ప్రభుత్వాన్ని డిసెంబరు 9న ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఆ తేదీకి ఉన్న ప్రాధాన్యతను చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు మంచి రోజా? కాదా? ముహుర్తాల్ని చూసుకొని కొలువు తీరటం కనిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా డేట్ వాల్యూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. డిసెంబరు 9 ప్రాధాన్యత గురించి చెబుతున్న వివరణ తెలంగాణ వాదుల్ని ఆకర్షిస్తోంది.
మలిదశ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రకటన రావటం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు మొదటి పునాది రాయి పడిన డిసెంబరు తొమ్మిదిన.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగాకాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. డిసెంబరు మూడో తేదీన ఉన్న ప్రత్యేకతను ప్రస్తావిస్తూ.. తన ఆత్మబలిదానంతో యావత్ తెలంగాణను కదిలించిన శ్రీకాంతాచారిని తమ వాడిగా కాంగ్రెస్ చెబుతోంది.
మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళలో.. డిసెంబరు 3న శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని.. యాద్రచ్ఛికంగా అదే డిసెంబరు మూడున ఈసారి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ఫలిస్తుందని.. దేశంలోన అన్ని ఎగ్జిట్ పోల్స్ తమ పార్టీకే అధికారంలోకి వస్తున్నట్లు చెప్పాయని చెబుతున్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సైతం ఎల్ బీ స్టేడియంలో చేపడతామని చెబుతూ.. 2004లో వైఎస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. అదే బాటలో తాము ముందుకు సాగుతామని చెప్పటం గమనార్హం. ఇలా.. ప్రతి అడుగులోనూ భావోద్వేగం ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.