ఏపీలో కాంగ్రెస్ ఉనికి అక్కడ ఉంటుందా ?
నిజమేనా గుర్రం ఎగరావచ్చు అంటే అది కాంగ్రెస్ విషయంలో నిజమవుతుందా.
నిజమేనా గుర్రం ఎగరావచ్చు అంటే అది కాంగ్రెస్ విషయంలో నిజమవుతుందా. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ కి 2024 ఎన్నికలు దశ మారుస్తాయా అంటే అవును అనేలా ఒక పరిణామం కనిపిస్తోంది. అదే ఒంగోలు జిల్లాలో కాంగ్రెస్ కి గెలుపు ఆశలు ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఎక్కడా కాంగ్రెస్ కి ఆశలు లేవు. ఆఖరుకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ సీటులో కూడా ఆశలు అయితే లేవు. కానీ ఒంగోలులోని చీరాలలో మాత్రం కాంగ్రెస్ ఎంతో కొంత ఉనికి చాటుకునే చాన్స్ ఉందని అంటున్నారు.
దానికి కారణం కాంగ్రెస్ బలం కాదు మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ అని అంటున్నారు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసినా ఓటమి వరించింది. ఈసారి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన పార్టీ మారి కాంగ్రెస్ నుంచి చీరాలలో పోటీ చేస్తున్నారు.
దాంతో ఈసారి ఆయన తన బలాన్ని ఎంతో కొంత చాటుకుంటారు అని అంటున్నారు. నిజానికి చూస్తే 2014 విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక ఏర్పడిన నేపథ్యంలో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా ఉన్న ఆమంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి పోతుల సునీతపై 10 వేల 335 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు/
అదే క్రిష్ణ మోహన్ 2019లో వైసీపీ నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి 17వేల పై చిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. అయితే తనకు సొంత బలం ఉందని భావిస్తూ ఆమంచి క్రిష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని చూసుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎం కొండయ్య యాదవ్ పోటీకి దిగారు కాంగ్రెస్ పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ రంగం లోకి దిగి పోటీని రసవత్తరం గా మార్చారు. ఈ నేపథ్యంలో ఓటరు నాడి ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ ఏపీలో ఎక్కువ చోట్లనే పోటీ చేస్తోంది. కానీ ఎక్కడా గెలుస్తామని గ్యారంటీ అన్నది అయితే లేదు. కానీ ఎందుకో చీరాల సీటు విషయంలో మాత్రం ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే ఉంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ సత్తా చూపినా ఆ క్రెడిట్ పూర్తిగా క్రిష్ణ మోహన్ అకౌంట్ లోకే అని అంటున్నారు. అంతే కాదు రేపటి రోజున ఆయన గెలిచిన కాంగ్రెస్ లో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు.