పురుషుల కోసం గర్భనిరోధక ఇంజెక్షన్... 99.02% ఓకే!

అవును... పురుషులు వినియోగించేందుకు వీలుగా తొలిసారిగా ఒక ఇంజెక్షన్ ను భారత వైద్య పరిశోధక మండలి అభివృద్ధి చేసింది.

Update: 2023-10-20 04:18 GMT

సాధారణంగా మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు పురుషులు వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం లేదా కండోమ్స్ వాడటం వంటివి పాటిస్తుంటారు. అయితే పురుషుల‌కు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. స్త్రీలు గ‌ర్భం దాల్చకుండా ఉండేలా ఒక ఇంజెక్షన్ ను తయారు చేశారు. మొట్టమొదటిసారిగా "రివర్సిబుల్ ఇన్ హైబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్‌.ఐ.ఎస్‌.యూ.జీ)" ను భారత వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్‌) విజయవంతంగా పూర్తిచేసింది.

అవును... పురుషులు వినియోగించేందుకు వీలుగా తొలిసారిగా ఒక ఇంజెక్షన్ ను భారత వైద్య పరిశోధక మండలి అభివృద్ధి చేసింది. దీనికి “రివర్సిబుల్ ఇన్ హైబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్” అని నామకరణం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ గర్భ నిరోధక ఇంజెక్షన్‌ పై క్లినికల్‌ ట్రయల్స్‌ ను భారత వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్‌) విజయవంతంగా పూర్తిచేసింది.

ఈ విధంగా క్లీనికల్ ట్రయల్స్ ని పూర్తిచేసిన ఐసీఎంఆర్‌... అనంతరం ఈ సూదిమందు సురక్షితమేనని తేల్చింది. గర్భనివారణలో అది 99.02% సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించింది. ఇదే సమయంలో ఈ ఆర్‌.ఐ.ఎస్‌.యూ.జీ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని కూడా ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

దీనికోసం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతితో.. 25-40 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 303 మంది ఆరోగ్యవంతులపై ఢిల్లీ, లుధియానా, జైపుర్‌, ఉధయ్ పుర్‌, ఖరగ్‌ పుర్‌ లలో ఐసీఎంఆర్‌ ఈ ఇంజెక్షన్‌ కు సంబంధించిన ట్రయల్స్‌ నిర్వహించింది. అయితే ఈ 303 మందీ... కుటుంబ నియంత్రణ చికిత్స కోసం భార్యలతో కలిసి ఆసుపత్రులకు వచ్చినవారే అని పేర్కొంది!

ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన పరిశోధనా ఫలితాలు "ఆండ్రాలజీ" జర్నల్‌ లో పబ్లిష్ అయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా పురుషులకు రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యూజీ) అనే ఇంజెక్షన్‌ ను 60ఎంజీ మోతాదులో అందించగా.. వారిలో వీర్యకణాలను నియంత్రించడంలో ఈ ఇంజెక్షన్ 97.3 శాతం సమర్థంగా పని చేసిందని వెల్లడైంది. ఇదే సమయంలో... సంతానం కలగకుండా నిరోధించడంలో 99.02 శాతం మేర ఇది విజయం సాధించిందని తేలింది.

హార్మోనల్ ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ఇంజెక్షన్ ను రక్తనాళాల్లోకి ఎక్కించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. రెగ్యులర్ ఇంజెక్షన్ లాగా శరీర భాగానికి ఇంజెక్ట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇక ఈ ఇంజెక్షన్‌ ను ఒకసారి తీసుకుంటే 13 సంవత్సరాల పాటు సంతాన నిరోధకంగా పని చేస్తుందని చెబుతుండటం గమనార్హం.

వాసెక్టమీ వంటి పద్ధతుల్లో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకుగానూ దానికి ప్రత్యామ్నాయంగా.. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయోగాల తర్వాత భారత వైద్య పరిశోధక మండలి ఈ ఇంజెక్షన్‌ ను డెవలప్ చేసింది.

Tags:    

Similar News