నోటిఫికేషన్ కి కౌంట్ డౌన్..తొలి రోజు నామినేషన్ ఎవరిదంటే ?

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గత నెల 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చినపుడు రెండు నెలల సుదీర్ఘ సమయం ఉందని అంతా అనుకున్నారు.

Update: 2024-04-12 03:38 GMT

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గత నెల 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చినపుడు రెండు నెలల సుదీర్ఘ సమయం ఉందని అంతా అనుకున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని అనుకున్నారు. చూస్తూండగానే ఎన్నికలు నెల రోజుల లోపుకు వచ్చేశాయి. ఇక మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని అనుకున్న వారికి ఇపుడు ఏప్రిల్ లో నోటిఫికేషన్ కి టైం దగ్గరపడింది అని అర్ధం అవుతోంది.

ఈ నెల 18న ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మూడవ విడత ఎన్నికలకు ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ అవుతోంది. నాలుగవ విడతలో ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ అలాగే ఒడిషా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ఇతర రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే వారం రోజుల పాటు నామినేషన్ల దాఖలుకు టైం ఉంటుంది. అంటే ఈ నెల 25 దాకా నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు అని అంటున్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 29లోగా నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు.

ఆ తరువాత తుది జాబితా రెడీ అవుతుంది. అక్కడ నుంచి కచ్చితంగా రెండు వారాలలో పోలింగ్ ఉంటుంది. మొత్తానికి ఏపీలో చూస్తే ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 18న నోటిఫికేషన్ రిలీజ్ కాగానే తొలి నామినేషన్ వేసే రాష్ట్ర ప్రముఖులలో నారా లోకేష్ ఉన్నారు. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేయబోతున్నారు.

ఈసారి తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక ఈ నెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నుంచి మూడవసారి గెలిచేందుకు వైసీపీ తరఫున అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. చంద్రబాబు ఎపుడు నామినేషన్ దాఖలు చేస్తారు అన్నది ఇంకా తెలియరాలేదు. ప్రతీ సారీ చంద్రబాబు తన తరఫున కీలక నాయకుడిని పంపించి నామినేషన్ దాఖలు చేయించేవారు.

కుప్పంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంతో పాటు అక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న పరిస్థితుల నేపధ్యంలో ఈసారి చంద్రబాబు స్వయంగా వచ్చి ఎమ్మెల్యేగా తన నామినేషన్ దాఖలు చేస్తారు అని అంటున్నారు. నామినేషన్ ఘట్టంతోనే గెలుపు టీడీపీదే అని భారీ విజయం ఖాయమని చాటి చెప్పాలని వైసీపీకి ఆ విధంగా చెక్ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన ఎపుడు నామినేషన్ దాఖలు చేస్తారు అన్నది వెల్లడి కాలేదు. ఆయన కూడా ఈ నెల 20 తరువాత ఎపుడైనా నామినేషన్ దాఖలు చేయడానికి మంచి రోజు చూసుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్రముఖ నాయకులలో ఎవరెవరు ఎపుడెపుడు నామినేషన్లు దాఖలు చేస్తారో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News