'ఆయ‌న సంసారానికి ప‌నికిరాడు ఓడించండి.. ఆవిడే ప‌నికిరాదు ఓడించండి'

రాజ‌కీయాలు దారుణంగా మారాయి. విలువ‌లు లేవు.. అంటూ.. త‌ర‌చుగా సీనియ‌ర్ నాయ‌కులు చెబుతారు.

Update: 2024-03-12 10:30 GMT

రాజ‌కీయాలు దారుణంగా మారాయి. విలువ‌లు లేవు.. అంటూ.. త‌ర‌చుగా సీనియ‌ర్ నాయ‌కులు చెబుతారు. ఇది ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్‌లో నిజ‌మైపోయింది. మాజీ భార్యాభ‌ర్త‌లు ఒకే స్థానం నుంచి వేర్వేరు పార్టీల త‌ర‌ఫున పార్ల‌మెంటుకు పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకుంటూ.. రాజ‌కీయాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ క‌థేంటో చూడండి.

లోక్సభ ఎన్నికల్లో ప‌శ్చిమ‌ బంగాల్లోని బిష్ణుపుర్ లోక్సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు ఒక‌రిపై ఒక‌రు పోటీచేస్తున్నారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, మరొకరు బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. మాజీ భార్యాభ‌ర్త‌లు పోటీచేయ‌డం ఇదే తొలిసారి. వారే. సౌమిత్ర ఖాన్‌, సుజాతా మండ‌ల్. ఇద్ద‌రూ ఓ నాలుగేళ్ల కింద‌టి వ‌ర‌కు భార్యాభ‌ర్త‌లు. అంతేకాదు.. ఇద్ద‌రూ గాఢంగా ప్రేమించుకుని , ఇళ్లో వాళ్ల‌ను ఎదిరించి ఆద‌ర్శ పెళ్లి చేసుకున్నారు.

సుజాత ఓ స్కూల్ టీచ‌ర్. ఆ స‌మ‌యానికే సౌమిత్ర తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఓ సంద‌ర్భంలో సుజాత ఓ ప‌నిపై ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఇలా .. ఇద్ద‌రూ తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ్డారు. వెంట‌నే ఇంట్లో పెద్ద‌లను ఎదిరించి వివాహం చేసుకున్నారు. సుమారు ప‌దేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ప్ర‌శాంతంగా సాగిపోయింది. అయితే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి సౌమిత్ర‌ఖాన్‌ను బీజేపీ త‌న‌వైపు తిప్పుకొంది. దీంతో ఆయ‌న ఆ పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు తృణ‌మూల్ కాంగ్రెస్‌ను విడిచి పెట్టి బీజేపీ బాట ప‌ట్టారు.

బీజేపీ వ్యూహానికి టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చెక్ పెట్టేందుకు రెడీ అయి సౌమిత్ర భార్య‌ సుజాతను త‌న‌వైపు తిప్పుకొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేర్చుకున్నారు. ఇదే.. సౌమిత్ర‌, సుజాతల వైవాహిక బంధంలో చిచ్చు పెట్టింది. బీజేపీ ఎంపీగా ఉన్న సౌమిత్ర‌, ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే టీఎంసీలో ఉన్న సుజాత‌ల మ‌ధ్య తీవ్ర వివాదాలు రాజుకున్నాయి. నువ్వు పార్టీ వ‌దిలేయాల‌ని సౌమిత్ర అంటే..కాదు .. నువ్వే బీజేపీని వీడి తృణ‌మూల్ జెండా మోయాల‌ని సుజాత‌లు కీచులాడుకున్నారు.

ఇది తీవ్ర వివాదాల‌కు దారితీసి.. మీడియా స‌మ‌క్షంలోనే ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అప్ప‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుజాత‌కు మ‌మ‌త టికెట్ ఇచ్చారు. ఆమె విజ‌యం కూడా సాధించారు. అప్ప‌టి నుంచి సీఎం మ‌మ‌త‌కు అత్యంత ఆప్తురాలిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా బిష్ణుపుర్ లోక్సభ స్థానం నుంచి సౌమిత్ర ఖాన్కు బీజేపీ టికెట్ ఇవ్వ‌గా... టీఎంసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈ స్థానాన్ని సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సూజాత మండల్ ద‌క్కించుకున్నారు.

ఇద్ద‌రూ ప్ర‌చారం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో అభివృద్ధి, ప్ర‌జ‌ల సంక్షేమం కంటే కూడా.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. దాంప‌త్య బంధాన్ని కూడా రాజ‌కీయాల్లోకి లాగేశారు. "ఆయ‌న సంసారానికి ప‌నికిరాడు. ఇక‌, ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ఏం ప‌నిచేస్తాడు అని సుజాత అంటే, ఆవిడే సంసారానికి ప‌నికిరాదు. తిని ప‌డుకోవ‌డం త‌ప్ప ఏ నాడూ భ‌ర్త గురించి ప‌ట్టించుకోలేదు. ఆమెనే ఓడించండి`` అని సౌమిత్ర ప్ర‌చారం చేస్తున్నారు. రేటింగ్ కోసం త‌ప‌న ప‌డే మీడియా వీరి వ్యాఖ్య‌ల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News