సూరీడు అండ్ కో మీద కేసు నమోదు చేయమన్న కోర్టు!

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అందరికి సుపరిచితమైన సూరీడు మీద తాజాగా కేసు నమోదైంది

Update: 2023-09-22 04:28 GMT

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అందరికి సుపరిచితమైన సూరీడు మీద తాజాగా కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై కేసు కట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయటంతో బంరాజాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎందుకిలా? అసలేమైంది? అన్న విషయాల్లోకి వెళితే.. సూరీడు కుమార్తెను కడపకు చెందిన సురేందర్ రెడ్డికి ఇచ్చి గతంలో పెళ్లి చేశారు.

అనంతరం భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సూరీడు కుమార్తె భర్త మీద వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు. 2021 మార్చి 23 రాత్రి సురేందర్ రెడ్డి క్రికెట్ ఆడి తన కుమార్తెను చూసేందుకు జూబ్లీహిల్స్ లోని తన మామా సూరీడు ఇంటికి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా అల్లుడు మీద సూరీడు దాడి చేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సురేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పట్లో జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ గా పని చేసిన రాజశేఖర్ రెడ్డి.. ఎస్ఐ నరేష్ లతో పాటు.. ప్రస్తుతం ఏపీలో ఐజీగా పని చేస్తున్న పాలరాజులు కలిసి తనను అక్రమంగా నిర్బందించి.. దాడికి పాల్పడినట్లుగా సురేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకోవటంతో పాటు.. తప్పుడు కేసులు పెట్టిన తన మామ సూరీడు (సూర్యనారాయణ రెడ్డి).. రాజశేఖర్.. నరేష్.. పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు అదేశాలు జారీ చేశారు. దీంతో.. బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కేసు నమోదు చేశారు. ఏపీలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న పాలరాజు మీద గతంలోనూ సురేందర్ రెడ్డి కంప్లైంట్ చేయగా.. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసు నమోదు కావటం గమనార్హం.

Tags:    

Similar News