క్రైం "పార్ట్ నర్స్": ఆమెకు 59, అతడికి 35... 33 ఏళ్ల జైలుశిక్ష!

క్రైం చేయడం వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నట్లుగా జీవిస్తున్న ఒక భారతీయ జంటకు తాజాగా బ్రిటన్ కోర్టు ఏకంగా 33 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Update: 2024-02-01 07:30 GMT

క్రైం చేయడం వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నట్లుగా జీవిస్తున్న ఒక భారతీయ జంటకు తాజాగా బ్రిటన్ కోర్టు ఏకంగా 33 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం వీరికి విధించిన శిక్షతో పాటు వీరు చేసిన నేరాలు - ఘోరాలు వైరల్ గా మారాయి. ఏమాత్రం భయం, భక్తి లేవు అన్నట్లుగా వీరిద్దరూ నేరాలు - ఘోరాలు చేయడంలో ఎక్కడా లేని ఉత్సాహాన్ని చూపిస్తుంటారనే విషయం వీరి ప్లాష్ బ్యాక్ చూస్తే అర్ధం అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ఆరతీ ధీర్‌(59) - కవల్జిత్‌ సిన్హ్ రైజాడా(39) అనే భారతీయ జంటకు బ్రిటన్‌ లో చెరో 33 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. మే 2021లో సిడ్నీకి వచ్చిన 57 మిలియన్ పౌండ్ల విలువైన కొకైన్‌ ను ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ఏ.బీ.ఎఫ్.) అడ్డుకోవడంతో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌.సి.ఎ) పరిశోధకులు ఈ క్రైం "పార్ట్ నర్స్" ని గుర్తించారట. విదేశాలకు కొకైన్ ఎగుమతి చేయడంతోపాటు మనీలాండరింగ్ కి పాల్పడటం వీరికి రిటీన్ అని అంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం సౌత్‌ వార్క్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణ అనంతరం కోర్టు... వీరిద్దరూ 12 సార్లు డ్రగ్స్ ఎగుమతి చేసినట్లు, 18 మనీ లాండరింగ్‌ లకు పాల్పడినట్లు నిర్ధారించారు! దీంతో మంగళవారం వీరికి శిక్షలు ఖరారు చేశారు. వీరిద్దరూ ఎగుమతి చేసిన డ్రగ్స్ యూకే నుండి వాణిజ్య విమానం ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేయబడ్డాయని గుర్తించారంట అధికారులు.

వీరు విమానంలో ఎగుమతి చేసిన సమయంలో ఆరు మెటల్ టూల్‌ బాక్స్‌ లను తెరిచినప్పుడు.. అందులో సుమారు 514 కేజీల కొకైన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో వీటి విలువ 57 మిలియన్ పౌండ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. అంటే భారత కరెన్సీలో సుమారు రు. 600 కోట్లన్నమాట! ఈస్థాయిలో ఈ జంట దందా ఉందన్నమాట!!

వాస్తవానికి యూకేలో హోల్ సేల్ లో ఒక కిలో కొకైన్ ధర దాదాపు 26,000 పౌండ్‌ లుగా ఉండగా... ఆస్ట్రేలియాలో అదే మొత్తం 1,10,000 పౌండ్‌ లకు విక్రయిస్తారంట. ఇలా డ్రగ్స్‌ ను స్మగ్లింగ్ చేయడమే లక్ష్యంగా వైఫ్లీ ఫ్రైట్ సర్వీసెస్ అనే కంపెనీని ఏర్పాటు చేసిన ధీర్, రైజాడల నుంచి ఈ సరుకును అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఉన్న మెటల్ టూల్‌ బాక్స్‌ లపై రైజాడా వేలిముద్రలు కనుగొనబడ్డాయని అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో... రైజాడా తన తల్లి పేరుతో అద్దెకు తీసుకున్న హాన్‌ వెల్‌ లోని ఒక స్టోరేజ్ యూనిట్‌ లో దాదాపు 3 మిలియన్ పౌండ్ల నగదును బాక్స్‌ లు, సూట్‌ కేసులలో దాచిపెట్టినట్లు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు గుర్తించారని.. ఇదే సమయంలో... నిందితులిద్దరూ తమ ప్రకటించిన ఆదాయానికి మించిన నగదును బ్యాంకు ఖాతాల్లో ఉంచినట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... 2019 నుండి సుమారు 7,40,000 పౌండ్ల నగదును 22 వేర్వేరు బ్యాంకు ఖాతాలలో జమ చేయడంతోపాటు మనీలాండరింగ్‌ కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఇదే సమయంలో వారు ఈలింగ్‌ లో 8,00,000 పౌండ్‌ లకు ఒక ఫ్లాట్‌ ను.. 62,000 పౌండ్‌ లకు ల్యాండ్ రోవర్‌ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తుంది.

కాగా... 2017 సమయంలో ఈ జంట భారత్‌ లోని గుజరాత్‌ లో ఒక బాలుడిని దత్తత తీసుకొని, అతడి పేరిట రూ.1.3 కోట్ల జీవిత బీమా చేయించింది! అయితే... అనంతరం ఈ బీమా సొమ్ము కోసం బాలుడిని, అతడి బావను హత్య చేయించారనే ఆరోపణ వీరిపై ఉంది. దీంతో... ఈ హత్యకేసులో ఆరతి, రైజాడాలను తమకు అప్పగించాలని భారత్‌ కోరినప్పటికీ... మానవహక్కుల రక్షణ పేరిట బ్రిటన్‌ 2020 ఫిబ్రవరిలో ఆ వినతిని తోసిపుచ్చింది.



Tags:    

Similar News