ఆ సీఎం మళ్లీ జైలుకే.. తేల్చేసిన కోర్టు!
ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బెయిల్‌పై వచ్చిన ఆయన జూన్ 2వ తేదీ వరకు ప్రజా బాహుళ్యంలో ఉండనున్నారు.
మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ ఫలితాల్లో తమ జాతకం చూసుకుని సంబరాలు చేసుకోవాలన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆయనకు ఊరట లభించలేదు. దీంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనే ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బెయిల్‌పై వచ్చిన ఆయన జూన్ 2వ తేదీ వరకు ప్రజా బాహుళ్యంలో ఉండనున్నారు. ఈమేరకు గతంలోనే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
దీంతో ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్.. తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు.అయితే.. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయంలో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనికి ముందు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తర్వాత.. సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిని సానుకూలంగా పరిశీలించిన కోర్టు జూన్ 2వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. ఇది ముగియడానికి ముందు.. మరోసారి కేజ్రీవాల్ తన అనారోగ్య సమస్యలను ఏకరువు పెట్టారు.
తనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, మధుమేహం కూడా ఉందని.. కాబట్టి ఈ బెయిల్‌ను జూన్ 9వ తేదీ వరకు పొడిగించాలని విన్నవించారు. కానీ, ఈ విషయంలో కింది కోర్టుకు వెళ్లాలని.. సుప్రీంకోర్టు సూచింది. దీంతో తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తన బెయిల్‌ను వారం రోజులు పొడిగించాలని కోరారు. అయితే.. ఈడీ ఆయనకు బెయిల్ పొడిగించేందుకు అంగీకరించలేదు.
వాస్తవాలను తొక్కిపెట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు ఊరట నివ్వలేదు. విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ 2వ తేదీన జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే. ఎన్నిక లఫలితాలకు ముందు ఇలా.. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఆప్ నేతలు ఆవేదనలో ఉన్నారు.