ఎమ్మెల్యేలను మార్చితే లాభమేంటి...ఎర్రన్న హాట్ కామెంట్స్...!
వైసీపీ మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తాజా మార్పుచేర్పులు మీద తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు.
వైసీపీ మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తాజా మార్పుచేర్పులు మీద తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రమే ఒరిగేది ఏమీ ఉండదని తేల్చేసారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగిందని ఆయన ఆక్షేపించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో తిరిగి ప్రజలకు దూరం అయ్యారని నిందించారు. సీఎం వస్తే చెట్లూ చేమలను కూడా నరికే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ప్రజాస్వామ్యం లేకపోవడం, అహంభావం వంటివే తెలంగాణాలో మార్పునకు కారణం అయ్యాయని ఏపీలో కూడా అదే జరుగుతుందని నారాయణ జోస్యం చెప్పారు. ప్రభుత్వం పాలసీలు చేస్తుందని దాన్ని ఎమ్మెల్యేలు అమలు చేస్తారని ఆయన సూత్రీకరించారు.
అలాంటపుడు పాలసీలు చేసిన వారిదే తప్పు తప్ప ఎమ్మెల్యేలది ఎలా అవుతుందని లాజిక్ పాయింట్ తీశారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలదే తప్పు ఉందని ఇసుక మైన్స్ పాలసీలు సర్కార్ చేయబట్టే వాటిని ఎమ్మెల్యేలు అనుసరించి దందాలు చేశారు అని నారాయణ అంటున్నారు.
ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని నారాయణ అంటున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే బై జ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు 370 ఆర్టికల్ గురించి బీజేపీ నేతలకు ఏమీ తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని నారాయణ అంటున్నారు.