కొత్త ఎమ్మెల్యేల్లో 69 శాతం అలంటి రికార్డు ఉన్నవారే!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది

Update: 2023-12-07 04:11 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మొదటి రెండు దఫాలు గులాబీ పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు.. తాజా ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. అయితే.. తాజా ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యులు గెలుపొందారు. అంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మించి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

కాకుంటే.. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ చేతిలో 39 మంది ఎమ్మెల్యేలు ఉండటం.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మజ్లిస్ కు 7గురు ఎమ్మెల్యేలు ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాలేదు. మజ్లిస్ బలాన్ని కలుపుకున్నా గులాబీ పార్టీకి 46 మందే అవుతారు. అంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 14 మంది అవసరం అవుతారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతోంది.

ఇక.. తాజా ఎన్నికల్లో గెలుపొందిన 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చూస్తే.. 68 శాతం మంది ఎమ్మెల్యేలు నేర చరిత ఉన్న వాళ్లే కావటం విశేషం. క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలు 82 మంది కాగా.. వారిలో 59 మంది మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మీద హత్యానేరం కేసు ఉండగా.. మరో ఏడుగురి మీద హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలు చేసినట్లుగా ఆరోపణలు ఉండటం గమనార్హం. ఈ వివరాలన్ని అభ్యర్థులు తమ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పొందుపర్చిన అఫిడవిట్ లో ఉన్నాయి. ఈ వివరాలకు సంబంధించిన నివేదికను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్రిఫామ్స్ విడుదల చేసింది. దీని ప్రకారం కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మందిలో 19 మంది.. బీజేపీ నుంచి గెలిచిన 8 మందిలో ఏడుగురు.. మజ్లిస్ నుంచి గెలిచిన 7గురిలో నలుగురు.. సీసీఐ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థిసైతం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.

తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 31 మంది ఉంటే.. బీఆర్ఎస్ కు చెందిన వారు ఏడుగురు.. మజ్లిస్ కు చెందిన ముగ్గురు ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో 114 మంది కోటీశ్వరులే కావటం విశేషం. కాంగ్రెస్ లో 60 మంది.. బీఆర్ఎస్ లో 38 మంది.. మజ్లిస్ లో ఏడుగురు.. బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది.. సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే. వీరిలో టాప్ 3 సంపన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వెంకటస్వామి రూ.606 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458కోట్లు.. పాలేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన పొంగులేటి రూ.432 కోట్లతో శ్రీమంతుల జాబితాలో ఉన్నారు.

అతి తక్కువ ఆస్తిపాస్తులు ఉన్న ఎమ్మెల్యేల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బోజ్జు అందరి కంటే తక్కువ ఆస్తులు ఉన్న వారు. ఆయన ఆస్తి కేవలం రూ.24 లక్షలే. తర్వాతి స్థానంలో ఎమ్మెల్యే బాలునాయక్ కు రూ.28 లక్షల ఆస్తులు ఉండగా.. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కు రూ.56 లక్షల ఆస్తులే ఉన్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఇక.. అత్యధిక వార్షిక ఆదాయం ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్తానంలో కోమటిరెడ్డి.. రెండో స్థానంలో గడ్డం వివేక్.. మూడో స్థానంలో కేటీఆర్ ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కోమటిరెడ్డి వార్షిక ఆదాయం రూ.71 కోట్లు కాగా.. గడ్డం వివేక్ ఆదాయం రూ.15 కోట్లు. కేటీఆర్ ఆదాయం రూ.12 కోట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News