ఏపీలో అన్ని పార్టీల ఆందోళన దీనిపైనే!
దీంతో అన్ని పార్టీలు ఓట్ల కొనుగోలుపై దృష్టి సారించాయని సమాచారం.
మే 13న ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ, అధికారంలోకి రావడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తలపడుతున్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటీలో ఉన్నా.. ప్రధాన పోటీ వైసీపీకి, టీడీపీ, జనసేన కూటమికి మధ్యే జరగనుంది.
మే 11 సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీంతో అన్ని పార్టీలు ఓట్ల కొనుగోలుపై దృష్టి సారించాయని సమాచారం. భారీ ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర గిఫ్టులను కుమ్మరిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ పోటీ చేస్తున్న కుప్పం, పిఠాపురం, మంగళగిరిల్లో వారిని ఓడించడానికి భారీ ఎత్తున డబ్బు వెదజల్లుతున్నారని అంటున్నారు. ఓటుకు రూ.5 వేలు, కొన్ని చోట్ల రూ.10 వేలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.
కాగా అన్ని పార్టీలను ఒకే ఒక అంశం ఆందోళనకు గురి చేస్తోందని టాక్ నడుస్తోంది. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకే రోజు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో క్రాస్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందేమోనని అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. మే 13న ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు అసెంబ్లీ అభ్యర్థికి, మరో ఓటును పార్లమెంటు అభ్యర్థికి వేయాలి.
ఈ క్రమంలో రెండు ఓట్లను తమకు ఇష్టమైన ఒకే పార్టీ అభ్యర్థికి వేయకుండా.. ఒక ఓటును వేరే పార్టీ అభ్యర్థికి వేస్తారేమోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
సాధారణంగా చాలామంది ఓటర్లు ఏ పార్టీని నొప్పించడానికి ఇష్టం లేక ఒక ఓటును ఒక పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థికి వేస్తే మరొక ఓటును వేరే పార్టీకి చెందిన పార్లమెంటు అభ్యర్థికి వేస్తారు. దీన్నే క్రాస్ ఓటింగ్ అంటారు. ఇలా ప్రతిసారి ఎన్నికల్లో జరుగుతుంది.
ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి బాగా ఓట్లు వస్తే అదే పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థికి ఓట్లు తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చిన సందర్బాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అన్ని పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా ఒక ఓటును తమకు అసెంబ్లీకి వేసి ఇంకో ఓటును మీ ఇష్టమొచ్చినవారికి వేసుకోమంటూ చెబుతుంటారు. అలాగే అభ్యర్థుల వద్ద ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నవారు కూడా ఒక ఓటును వారికి వేసి ఇంకో ఓటును వేరే పార్టీకి వేస్తుంటారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచబోతోందనన్న ఆందోళన అన్ని పార్టీలను పట్టి పీడిస్తోందని తెలుస్తోంది.