కొత్త యుద్ధంతో రెక్కలు విప్పిన చమురు ధరలు

సాంకేతికత పెరిగింది. ప్రపంచం హద్దులు మారాయి. దేశాల మధ్య సరిహద్దుల సంగతి ఎలా ఉన్నా.. ఎక్కడో రెండు దేశాల మధ్య జరిగే యుద్దం ప్రపంచానికి కొత్త భారాన్ని తెచ్చి పెడుతోంది

Update: 2023-10-09 23:30 GMT

సాంకేతికత పెరిగింది. ప్రపంచం హద్దులు మారాయి. దేశాల మధ్య సరిహద్దుల సంగతి ఎలా ఉన్నా.. ఎక్కడో రెండు దేశాల మధ్య జరిగే యుద్దం ప్రపంచానికి కొత్త భారాన్ని తెచ్చి పెడుతోంది. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలకు కొత్త కష్టాల్ని తెస్తోంది. ఆ మధ్యన ఉక్రెయిన్ - రష్యా మధ్య మొదలైన వార్.. ప్రపంచ దేశాలకు ఇబ్బందుల్ని తెచ్చి పెడితే.. తాజాగా ఇజ్రాయెల్ మీద మెరుపు దాడి చేసిన హమస్ కారణంగా పశ్చిమ ఆసియాలో కొత్త ఉద్రిక్తతకు తెర తీసినట్లైంది.

ఈ కొత్త యుద్ధం ఎఫెక్టు అప్పుడే షురూ అయ్యింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. గత వారంలో దాదాపు 8 వాతం తగ్గిన ధరలు ఈ రోజు (సోమవారం) 4 శాతం పెరిగాయి. చమురు ఉత్పత్తిలో ఈ ప్రాంతానిదే సింహ భాగమైన సంగతి తెలిసిందే. తాజా యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్యారెల్ ఒక్కొక్కటి 87.5 డాలర్లకు చేరుకుంది. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులతోనే సమకూరుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగే కొద్దీ.. ఆ ఎఫెక్టు మన మీద ఎక్కువగా పడుతుంది.

ఇక.. ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. ప్రాంతీయంగా అనిశ్చితి వాతావరణాన్ని తరచూ ఎదుర్కొనే ఆ దేశం.. రోజుకు 3 లక్షల పీపాల సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాల్ని నిర్వహిస్తుంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఆ దేశంపై తక్షణ ప్రభావం కలుగదని.. యుద్ధం దీర్ఘకాలం సాగితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు. హమస్ కు ఇరాన్ మద్దతు ఇస్తుందన్న వార్తలు మాత్రం కలవరానికి గురి చేస్తున్నాయి.

అయితే.. పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ముడి చమురును భారీగా ఉత్పత్తి చేసే బహ్రైన్.. ఇరాక్.. కువైట్.. ఒమన్.. యూఏఈ.. సౌదీలు హామీలు ఇవ్వటం కొంత ఉపశమనం కలిగించేలా ఉన్నా.. అవకాశం వచ్చినంతనే ధరల్ని పెంచేసే ఒపెక్ దేశాల్ని ఒక పట్టాన నమ్మే పరిస్థితి ఉండదు. అదే సమయంలో అనూహ్య పరిణామాలు సైతం ముడి చమురు ధరలపై ప్రభావాన్ని చూపే వీలుంది.

చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో కీలకమైన ఇరాన్ విషయానికి వస్తే.. తాజా యుద్దంలో హమస్ తరఫున నిలబడిన ఆ దేశంపై ప్రతీకారంతో దాడులు జరిగితే.. పరిస్థితులు మరింత దిగజారతాయి. గతంలో అమెరికా తన యుద్ధ నౌకల్ని పంపేందుకు ప్రయత్నించిన సమయంలో హర్ముజ్ ను మూసేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. తాజా ఉద్రిక్తతలు ఇజ్రాయెల్.. హమస్ వరకు పరిమితమైతే ఫర్లేదు. అంతకు మించి ముందుకెళ్లి.. సౌదీ సహా ఇతర దేశాలకు పాకితే మాత్రం ప్రమాదం మరింత పెరగటం ఖాయం. ఏమైనా.. కొత్త యుద్దం ఇక్కట్లను ప్రపంచ దేశాలు మళ్లీ మోయాల్సిన పరిస్థితి మొదలైందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News