`హారతి పళ్లెం` తెచ్చిన తంటా.. మంత్రిపై కేసు నమోదు!
ఎన్నికల సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. ఎన్నికల నిబంధనలు వారిని ఇరకాటంలోకి నెట్టేస్తూనే ఉంటాయి.
ఎన్నికల సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. ఎన్నికల నిబంధనలు వారిని ఇరకాటంలోకి నెట్టేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఏ చిన్న పనిచేసినా.. కూడా ఎన్నికల సంఘం కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. తెలంగాణ మంత్రి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్.
తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె.. బీఆర్ ఎస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం.. కొంగరగిద్ద మండలంలో సత్యవతి రాథోడ్ పర్యటించారు. అయితే.. ఇలాంటి కీలక నాయకులు వచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పార్టీకి అభిమానులుగా ఉన్న స్థానికులు జేజేలు కొట్టడం.. ఎర్రనీళ్లు తీయడం, గుమ్మడికాయలు కొట్టడం సహజంగా మారింది
ఇలానే సత్యవతి రాథోడ్‌కు కూడా.. కొంగరగిద్ద మండలంలోని పార్టీ అభిమాన మహిళలు.. కొందరు హారతి పట్టారు. దిష్టి తీశారు. దీంతో వారి అబిమానానికి పొంగిపోయిన సత్యవతి రాథోడ్.. వెంటనే తటాల్న.. తన పర్సులోంచి రూ.500 కాయితాలు తీసి(4వేలు ఉన్నాయని లెక్క) హారతి పళ్లెంలో వేశారు. ఇంకేముంది.. ఈ విషయం తెలిసిన విపక్షాలు.. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన..ఫ్లైయింగ్ సర్వవైవలెన్స్ టీం(సంచార నిఘా బృందం)కు సమాచారం చేరవేశారు.
దీంతో వారు రంగంలోకి దిగి నిజానిజాలు తేల్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన నిఘా బృందం కావడంతో వారు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించక తప్పలేదు పోలీసులకు. వెంటనే గూడురు పోలీసులు.. మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ.. కేసు పెట్టారు. కాగా.. దీనిపై స్పందించేందుకు సత్యవతి రాథోడ్ నిరాకరించారు.