బిగ్ అలర్ట్... కొరియర్ సర్వీస్ పేరు చెప్పి కోటిన్నర కొట్టేశారు!

వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలో నివసించే ఓ మహిళ (78) అమెరికాలో ఉంటున్న తన కుమార్తెకు వివిధ ఆహార పదార్థాలను కొరియర్ చేసింది. ఈ సమయంలో మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.

Update: 2025-01-07 23:30 GMT

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలు అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా కొత్త కొత్త మార్గాల్లో జనాలను మాయ చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. మోసపోయేవారు మోసపోతూనే ఉన్నారు.. చేతులు కాలిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

అవును... సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో, సరికొత్త వేషాల్లో మోసాలకు పాల్పడుతూనే ఉంటున్నారు. ఈ విషయంలో తెలివైనవాళ్లం అనుకునేవాళ్లు, అమాయకులం అని నమ్మేవాళ్లు అనే తేడాలేమీ లేకుండా వారి బారిన పడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కొరియర్ చేసిన వస్తువులను పట్టుకుని ఓ మహిళ నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.

వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలో నివసించే ఓ మహిళ (78) అమెరికాలో ఉంటున్న తన కుమార్తెకు వివిధ ఆహార పదార్థాలను కొరియర్ చేసింది. ఈ సమయంలో మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఆమె పంపిన కొరియర్ పార్సిల్ లో చట్టవిరుద్ధమైన పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు దిగాడు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఆమెకు వరుసగా వివిధ డిపార్ట్ మెంట్స్ నుంచి అంటూ అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అని, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ అని చెబుతూ వరుస ఫోన్ కాల్స్ తో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ క్రమంలో పలు మార్లు వీడియో కాల్స్ కూడా చేశారు.

ఆ వీడియో కాల్స్ లో కనిపించిన వ్యక్తులు ఆయా డిపార్ట్ మెంట్స్ కు సంబంధించిన యూనీఫామ్స్ ధరించి మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో... వారు ధరించిన యూనీఫామ్స్ తో పాటు వారు మాట్లాడిన విధానం, చెబుతున్న సెక్షన్లు, మాట్లాడుతున్న విధానాలు అన్నీ గమనించిన ఆమె వాళ్లు నిజమైన అధికారులే అని నమ్మిందని అంటున్నారు.

అలా ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత అసలు విషయం మొదలుపెట్టిన సైబర్ నేరగాళ్లు... ఆమెకు పలు సూచనలు చేస్తూ వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ.1.50 కోట్ల వరకూ ఆమెతో పంపించుకున్నట్లు చెబుతున్నారు. విచారణలో భాగంగా ఇలా డబ్బులు పంపించాలని ఆమెను ఈ సైబర్ నేరగాళ్లు బెదిరించారని చెబుతున్నారు.

ఇంత వ్యవహారం నడుస్తున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఉన్న మహిళ.. డబ్బులు పంపించిన తర్వాత మాత్రం తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పిందంట. దీంతో.. ఇదంతా సైబర్ క్రైమ్ అని వారు చెపడంతో.. అప్పుడు కానీ తాను మోసపోయినట్లు గుర్తించలేదని.. అనంతరం సైబర్ క్రైమ్ హెల్ లైన్ కు విషయం చెప్పిందని అంటున్నారు.

దీంతో... రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె డబ్బులు పంపించిన ఖాతాలను పరిశీలించారని.. వాటిని గుర్తించడం కష్టమని చెప్పారని అంటున్నారు. దీంతో.. సదరు మహిళ లబోదిబో మంటున్నారని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News