బయటకు వచ్చిన కేడీ ఎస్సై భాగోతం మామూలుగా లేదుగా?

ఇంత భారీ మాదకద్రవ్యం సదరు ఎస్ఐకు ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీసిన పోలీసు అధికారులు ముక్కున వేలేసుకునే విషయాల్ని గుర్తించారు.

Update: 2023-08-30 06:25 GMT

ఈ మధ్యన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ మహానగరానికి చెందిన ఎస్ఐ రాజేందర్ కు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చి సంచలనంగా మారాయి. శనివారం తెల్లవారుజామున టీ న్యాబ్ పోలీసులు అతడ్ని అరెస్టు చేయటం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం అతగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తాజాగా అరెస్టు వెనుక జరిగిన కథ గురించి తెలిస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి. అతడ్ని అరెస్టు చేసినప్పుడు.. అతడి నుంచి 1750 గ్రాముల మొథాకొలిన్ డ్రగ్ ను సీజ్ చేశారు. ఇంత భారీ మాదకద్రవ్యం సదరు ఎస్ఐకు ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీసిన పోలీసు అధికారులు ముక్కున వేలేసుకునే విషయాల్ని గుర్తించారు.

భారత్ లో అరుదుగా దొరికే ఒక లిక్విడ్ ను ఫార్మా కంపెనీల్లో ఉపయోగిస్తారు. దాన్ని కెనడాకు పంపితే లక్షలాది రూపాయిలు సంపాదించే వీలుందని.. ఒక ఫార్మా కంపెనీలో పని చేసే మహిళా డాక్టర్ కు ఈ మొయిల్ వచ్చింది. దీంతో ఆశ పడ్డ ఆమె.. వారి వలలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆమె రూ.26 లక్షలు పోగొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదును సైబర్ పోలీసులకు చేశారు. ఈ కేసును టేకప్ చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎస్ఐ రాజేందర్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా లోతుగా పరిశోధించారు. రెండు నెలల పాటు దర్యాప్తు చేసిన అతడు.. నిందితులు నవీ ముంబయిలోని కందేశ్వర్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 22న అతడు.. ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి కందేశ్వర్ కు వెళ్లారు. అక్కడి స్థానిక పోలీసుల సాయంతో సైబర్ నేరాళ్ల ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తులు పట్టుబడ్డారు. అదే క్రమంలో ఒక బ్లాక్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు.

కందేశ్వర్ పోలీసులు ఆ ఇంట్లో మొత్తం మూడు కేజీల మొథాకొలిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకుంటే.. సందట్లో సడేమియా అన్న చందంగా రాజేందర్ రెండు కేజీల డ్రగ్ ను గుట్టుగా తరలించారు. తాజాగా రాజేందర్ అరెస్టు నేపథ్యంలో.. ఆయన ఇంటినుంచి స్వాధీనం చేసుకున్న 1750 గ్రాముల డ్రగ్ ఎక్కడిది? ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో ఈ గుట్టు మొత్తం బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో కందేశ్వర్ ఆపరేషన్ కు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయన్న మాట వినిపిస్తోంది. నేరస్తుల్ని పట్టుకునేందుకు వెళ్లి.. కేడీగా మారిన ఎస్ఐ ఉదంతం ఇప్పుడు డిపార్టుమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News