ట్రంప్ – మస్క్ ఇంటర్వ్యూపై సైబర్ దాడి.. ఏమిటీ డీడీఓఎస్?

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ఫీవర్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-13 04:53 GMT

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ఫీవర్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. అటు అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం కూడా మరింత జోరందుకుంది. ఈ సమయంలో ట్రంప్ – మస్క్ మధ్య ఆసక్తికర ఇంటర్వ్యూ జరిగింది. అయితే.. దీనిపై సైబర్ దాడి జరిగిందని మస్క్ ప్రకటించారు.

అవును... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయనను ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు.. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత, కుబేరుడు ఎలాన్ మస్క్. ఈ ఇంటర్వూలో ట్రంప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఈ ఇంటర్వ్యూపై సైబర్ దాడి జరిగిందని, అందుకే ఆలస్యంగా మొదలైందని మస్క్ ప్రకటించారు.

ట్విట్టర్ లో డొనాల్డ్ ట్రంప్ తో తాను నిర్వహించిన ఇంటర్వ్యూపై డీడీఓఎస్ సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ తెలిపారు. అందువల్లే ఈ కార్యక్రమం సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా మొదలైందని పేర్కొన్నారు. కాగా.. వెబ్ సైట్ లేదా యాప్ పనితీరు దెబ్బతీసేలా కృత్రిమంగా భారీ ఆన్ లైన్ ట్రాఫిక్ ని తీసుకురావడానికి డీడీఓఎస్ దాడిగా అభివర్ణిస్తారు.

ఈ "ఇంటర్వ్యూ ఆఫ్ ది సెంచరీగా" ఈ ముఖాముఖిని ట్రంప్ బృందం ప్రకటించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఇటీవల బైడెన్ తో తాను చేసిన డిబేట్ లో ఆయనను ఘోరంగా ఓడించినట్లు చెప్పుకున్న ట్రంప్.. తన వల్లే ఆయనను అధ్యక్ష రేసు నుంచి పంపించేశారని చెప్పుకున్నారు. పైగా ఆ పార్టీలో ఇంటర్నల్ వార్ జరుగుతుందని తెలిపారు!

ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధినేత షీ జిన్ పింగ్ లు తమ తమ ఆటల్లో టాప్ లో ఉన్నారని వ్యాఖ్యానించిన ట్రంప్... వారు తమ తమ దేశాలను ప్రేమిస్తుంటారు కానీ అది చాలా భిన్నమైన ప్రేమ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే... అలాంటి వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News