టీటీడీలో వారిద్దరికి పదవులపై పురందేశ్వరి ఆగ్రహం!

టీటీడీలో తాజా నియామకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

Update: 2023-08-26 12:29 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో తాజాగా 24 మంది సభ్యులను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు నియామకాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని పవిత్రమైన తిరుమల దేవస్థానం బోర్డులో సభ్యులుగా ఎలా నియమిస్తారని నిలదీస్తున్నారు.

టీటీడీలో తాజా నియామకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని మండిపడ్డారు. బోర్డు సభ్యులుగా శరత్‌ చంద్రారెడ్డి, కేతన్‌ దేశాయ్‌ నియామకమే ఇందుకు నిదర్శనమని పురందేశ్వరి తప్పుబట్టారు. ఢిల్లీ మద్యం స్కామ్‌లో శరత్‌ చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె విమర్శించారు. అలాగే జాతీయ వైద్య మండలి (ఎంసీఐ) స్కామ్‌లో దోషిగా తేలి కేతన్‌ దేశాయ్‌ తన పదవి కోల్పోయారన్నారు. అలాంటి వ్యక్తిని టీటీడీలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని బీజేపీ ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.

ఈ మేరకు పురందేశ్వరి ట్వీట్‌ చేశారు. ''మరి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి.. టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రమని.. శరత్‌ చంద్రారెడ్డి మరియు కేతన్‌ దేశాయ్‌ ని బోర్డుకి నియుక్తి చేసి నిరూపించారు. శరత్‌ చంద్రారెడ్డి ఢిల్లీ మధ్యం కుంభకోణంలో పాత్రధారుడుగా ఉంటే, కేతన్‌ దేశాయ్‌ ఎంసీఐ స్కామ్‌లో దోషిగా నిరూపించబడి, ఢిల్లీ హైకోర్టు ద్వారా తొలగించబడ్డారు. భారతీయ జనతా పార్టీ తిరుమల తిరుపతి పవిత్రతను మసక పరిచే ఈ నియామకాలను ఖండిస్తుంది'' అని పురందేశ్వరి తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. తన ట్వీటుకు జతగా వైసీపీ ప్రభుత్వం టీటీడీలో నియమించిన 24 మంది సభ్యుల జాబితాను కూడా జత చేశారు.

అలాగే టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తిరుమల శ్రీవారి సేవ కన్నా.. తన సొంతవారి సేవ ప్రాధాన్యం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడం రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యకృత్యం అయిందని మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో నిందితుడు శరత్‌ చంద్రారెడ్డికి, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులకు పదవులను కట్టబెట్టారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతల విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కాగా టీటీడీ సభ్యులుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషు బాబు, ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్‌ చంద్రారెడ్డి తదితరులను నియమించారు.

Tags:    

Similar News