వైసీపీ అవినీతి అంటూ మాటలేనా చిన్నమ్మా...?

వైసీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

Update: 2023-11-29 03:45 GMT

వైసీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె ఈ మాట కొత్తగా చెప్పడం లేదు. ఆమె ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చాలా సార్లు అన్నారు. ఏపీ అప్పులు చేస్తోంది అని అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది అని ఒక వైపు అంటూనే మరో వైపు ఆ సొమ్ము అంతా అవినీతి మయం అయింది అని అరోపిస్తున్నారు.

మద్యం ద్వారా ఏపీలో భారీ స్కాం జరిగింది అని ఆమె అంటున్నారు. ఇలా వైసీపీ అవినీతికి మారు పేరు అని పురంధేశ్వరి చెప్పడం పరిపాటిగా మారింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే పురంధేశ్వరి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న జాతీయ పార్టీకి సంబంధించి ఏపీ ప్రెసిడెంట్.

ఆమె పార్టీ దేశాన్ని ఏలుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. వైసీపీ అవినీతి ప్రభుత్వం అని పదే పదే మాటలు చెబుతున్న పురంధేశ్వరి ఎందుకు విచారణ జరిపించమని కేంద్రాన్ని కోరరని ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె కేంద్రాన్ని కోరినా కేంద్ర పెద్దలు ఎందుకు రియాక్ట్ కారు అన్నది కూడా మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది.

ఏపీలో వైసీపీ మీద రాష్ట్ర నేతలు కుస్తీ చేస్తూంటే కేంద్ర నేతలు దోస్తీ చేస్తున్నారా అన్న అనుమానాలూ జనాలలో ఉన్నాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలంగాణాలో బీజేపీ బండికి బ్రేకులు పడ్డాయి. అవినీతి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కేంద్ర పెద్దలు ఆయా రాష్ట్రాల పర్యటనలకు వచ్చినపుడు చెబుతూ ఉంటారు తీరా ఆచరణలో మాత్రం దర్యాప్తులు ఎందుకు ఉండవన్న ప్రశ్న సగటు జనంలో కలుగుతోంది.

పోనీ కేంద్రం ఏమైనా రాష్ట్రాల విషయాలలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదా అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు జారీ అవుతూంటాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు. అలాగే ఇతర విపక్షాలు ఉన్న చోట కూడా గట్టిగానే యాక్షన్ కి దిగుతూంటారు. మరి తెలుగు రాష్ట్రాలలో ఆ దూకుడు ఎందుకు లేదు అన్నదే ప్రశ్నగా ఉంది.

అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా పోలవరాన్ని ఏటీఎం గా వాడుకుంటున్నారు అని భారీ ఆరోపణను కేంద్ర పెద్దలు చేశారు. కానీ అంతలా అవినీతి జరిగితే దర్యాప్తు ఏది అన్న దానికి మాత్రం బదులు అయితే లేదు అంటున్నారు. అవినీతి జరిగింది అప్పులు పెరిగాయని చిన్నమ్మ అనడం కాదు, కేంద్రం అప్పులు ఎక్కువగా ఇవ్వకుండా చూడాలి. అలాగే అవినీతి జరిగి ప్రజల సొమ్ము పరుల పాలు అవుతూంటే కూడా పట్టుకుని విచారించేలా యాక్షన్ ఉండాలి. అంతే తప్ప మీడియా ముందు అవినీతి అంటూ గగ్గోలు పెడితే ఫలితం ఉంటుందా అన్నదే జనాల సూటి ప్రశ్నగా ఉంది మరి.

Tags:    

Similar News