ఆ విషయం పవన్ ను అడగండి: పురంధేశ్వరి

ఏపీలో జనసేన-బీజేపీల మధ్య అధికారికంగానే చాలాకాలంగా పొత్తు ఉన్న సంగతి తెలిసిందే

Update: 2024-01-05 06:44 GMT

ఏపీలో జనసేన-బీజేపీల మధ్య అధికారికంగానే చాలాకాలంగా పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అయితే, జనసేన-టీడీపీలతో కలిసి పనిచేసేందుకు బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని జనసేనాని పవన్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ పెద్దలను పవన్ ఒప్పించినట్లు కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అయితే, పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కాసేపటికే వీరు సమావేశం కావడం మాత్రం విశేషమే. పొత్తులపై చర్చించేందుకే పురందేశ్వరితో నాదెండ్ల భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. జనసేన-బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతోందని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీతో జనసేన పొత్తు ఉంది. దీంతో, మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో ఈ భేటీపై పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జనసేన తమ మిత్ర పక్షమేనని, జనసేనతో విడిపోయామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు. నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమని, శివప్రకాష్ జీని కలిసేందుకే మనోహర్ వచ్చారని ఆమె వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ ఏ పార్టీలో చేరారన్నది తమకు ముఖ్యమైన అంశం కాదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకోవాలన్నదే తమకు ముఖ్యమని, దాని గురించే ఆలోచిస్తామని అన్నారు. పొత్తులపై తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామని, అంతిమ నిర్ణయం బీజేపీ అధిష్టానానిదేనని చిన్నమ్మ చెప్పారు. బీజేపీని టీడీపీ-జనసేన కూటమితో కలిసి పనిచేసేలా సయోధ్య కుదురుస్తానన్నది పవన్ అని, ఆ విషయం ఆయనను అడగాలని చిన్నమ్మ చెప్పారు.

Tags:    

Similar News