ఉక్కుతో చిన్నమ్మ లెక్క మారుతుందా ?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. భారీ మెజారిటీతో ఆమె రాజమండ్రి నుంచి గెలిచి వచ్చారు. పైగా ఆమె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మంచి పెర్ఫార్మెన్స్ కనబరచారు అని చెప్పడానికి రిజల్ట్స్ కళ్ల ముందు ఉన్నాయి.
ఎన్నడూ లేని విధంగా 10కి 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఆరుగురు ఎంపీ అభ్యర్ధులలో ముగ్గురు గెలవడం అంటే అందులో పురంధేశ్వరి క్రెడిట్ కూడా ఉందని అంటున్నారు. దాంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అన్న చర్చ నడచింది. కానీ కేంద్ర బీజేపీ పెద్దలు ఏమి ఆలోచించుకున్నారో తెలియదు కానీ ఆమెను ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గానే కొనసాగమన్నారు.
ఆమె మరింతకాలం పార్టీని నడిపించేందుకే పరిమితం కావాల్సి ఉంది. ఆమె ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి జూలైకి ఏడాది అవుతుంది. ఆమె పదవీ కాలం మరో రెండేళ్ళు ఉంటుంది. అప్పటికి ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా కూడా పార్టీకి మంచి రిజల్ట్ ని ఇస్తే విస్తరణలో కచ్చితంగా ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.
అయితే ఈలోగా ఏపీ ప్రజలకు తాను ఏమి చేశాను అన్నది రుజువు చేసుకునే పనిలో పురంధేశ్వరి ఉన్నారు. ఆమె కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరగానే విశాఖ ఉక్కు కర్మాగారని ఇష్యూని టేకప్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం చూస్తోంది. దీని మీద కేంద్రం పాలసీ డెసిషన్ తీసుకుంది.
ప్రభుత్వం వ్యాపారం చేయరాదు అన్నది కేంద్రం విధానం. అంతే కాదు కేవలం స్టీల్ ప్లాంట్ తోనే కాకుండా దేశంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని తిరగతోడడం అంటే కేంద్రానికి కష్టం అని అంటున్నారు.
అయితే పురంధేశ్వరి ఈ సమస్యకు మధ్యేమార్గం కనుగొంటున్నారు. సెయిల్ లో స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయమంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అలా చేస్తే కనుక బతికి బట్టకడుతుందని సొంత గనుల కొరత తీరుతుదని ఆమె భావిస్తున్నారు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలన్న ఏపీ ప్రజల ఆశయం నెరవేరుతుందని భావిస్తున్నారు.
దీని మీద ఆమె కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలుసుకుని మొత్తం పరిస్థితిని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడమని కోరారు. కుమారస్వామి కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సెయిల్ లో కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం అయితే ఏపీకి అతి పెద్ద విజయం దక్కినట్లే.
ఈ కృషి చేసిన పురంధేశ్వరిని కూడా అంతా తప్పకుండా తలచుకోవాల్సిందే. ఆమె తాను ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో ఈ ఘనమైన ఉక్కు కార్యాన్ని చేపట్టి సక్సెస్ కావాలని చూస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు.