దగ్గుబాటి వైరాగ్యం పీక్స్... బాబు – జగన్ లపై కీలక వ్యాఖ్యలు!
అవును... ఓడినోడు అక్కడే ఏడుస్తుంటే, గెలిచినోడు ఇంటికెళ్లి ఏడుస్తున్నట్లుగా ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు
ఇటీవల కాలంలో మైకుల ముందు మాట్లాడుతూ... గత ఎన్నికల్లో తాను గెలవకపోవడం చాలా మంచిదైందని.. గెలిచినా తాను నియోజకవర్గానికి చేసిందేమీ ఉండేది కాదని.. తనను ఓడించింది ప్రజలు కాదు దేవుడే అని.. అది తన అదృష్టం అని కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు... ప్రస్తుత రాజకీయాలపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు రాజకీయాల్లో డబ్బే కీ రోల్ పోషిస్తుందని అన్నారు.
అవును... ఓడినోడు అక్కడే ఏడుస్తుంటే, గెలిచినోడు ఇంటికెళ్లి ఏడుస్తున్నట్లుగా ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. తాజాగా.. బాపట్ల జిల్లా, కారంచేడు మండలం, కుంకుల మర్రు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన స్మశానవాటిక, హెల్త్ క్యాంపు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినప్పటికీ ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం అని అన్నారు. అంత డబ్బు ఖర్చుపెట్టుకుని ఐదేళ్లు ప్రజల్లో తిరిగిన ప్రయోజనం లేకుండా పోయిందన్నట్లుగా తెలిపారు! అందువల్ల.. ఈరోజుల్లో టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు తన దృష్టిలో చాలా అదృష్టవంతులని వెంకటేశ్వర రావు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పార్టీల అధిపతులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి, సంపదంతా తమ వద్దకు చేర్చుకుంటున్నారని అన్నారు. ఫలితంగా... ఎమ్మెల్యేలకు ప్రజలకు సేవచేసే అవకాశం లేదని తెలిపారు. ఈ సందర్భంగా... సింగిల్ మ్యాన్ ఉన్న పార్టీలన్నీ ఇదే విధంగా చేస్తున్నాయంటూ దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు జగన్, ఇటు చంద్రబాబులకు ఒకేసారి కౌంటర్ వేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంపాదించుకున్న ఆ డబ్బుతో ప్రస్తుత రాజకీయాల్లో పోటీ చేయడమంటే వారి వారి పిల్లలను రోడ్డున పడేయడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి... సమాజంకోసం నిజంగా ఫైట్ చేసేవారిని కాపాడాలని, మిగతా వారిని రాజకీయాల నుండి దూరం చేయాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు చేశారు.