బీఆరెస్స్ జాతకం చెబుతున్న దానం... ఇంకా 15 రోజులేనట!

అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే బీఆరెస్స్ కు చెందిన పలువురు సీనియర్ లు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.

Update: 2024-07-12 09:46 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం జరిగినప్పటి నుంచీ బీఆరెస్స్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లోక్ సభ ఎన్నికల అనంతరం అయితే... రేవంత్ రెడ్డి పూర్తిగా బీఆరెస్స్ ను ఖాళీ చేయించే పనిలో బిజీగా ఉన్నారనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆరెస్స్ కు గుడ్ బై చెప్పి హస్తం అందుకోగా... మాజీ ఎంపీలూ ఇదే బాట పట్టారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడే చాలా మందికి ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రధానంగా బీఆరెస్స్ నేతల కోసం ఆయన గేట్లు ఎత్తేసిన విధానం చూసిన తర్వాత కన్ ఫర్మేషన్ వచ్చేసింది.

అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే బీఆరెస్స్ కు చెందిన పలువురు సీనియర్ లు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. మరీ సీనియర్లు అయితే వాళ్ల ఇంటికి స్వయంగా రేవంత్ రెడ్డే వెళ్లి మరీ కండువాలు కప్పేశారు. ఉదాహరణకు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారికి. ఇదే సమయంలో ఊహించని రీతిలో కడియం శ్రీహరి సైతం కారు దిగిపోయారు.

వీరితో పాటు బీఆరెస్స్ కీలక నేత కే కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి తో పాటు బీబీ పాటిల్, రాములు, వెంకటేష్, పసునూరి దయాకర్, బొంతు రామ్మోహన్, టి. రాజయ్య, రంజిత్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య మొదలైన కీలక నేతలు బీఆరెస్స్ కు బై బై చెప్పిన వారిలో ఉన్నారు.

ఇక మొన్నటికి మొన్న ఎమ్మెల్సీలు ఇచ్చిన సర్ ప్రైజ్ అయితే తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలం గుర్తుండే విషయమనే చెప్పాలి. ఇందులో భాగంగా... ఒకేసారి ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీరిలో భానుప్రసాద్ రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, బస్వరాజు సారయ్య, ఎగ్గే మల్లేశం ఉన్నారు.

ఈ నేపథ్యలో త్వరలో మరో ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ లో చేరిన బీఆరెస్స్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీఆరెస్స్ లో ఎమ్మెల్యేలకు గౌరవం దక్కడం లేదని.. కేటీఆర్ వారిని పురుగులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని... కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం ఉందని దానం నాగేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం మరో ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని బాంబు పేల్చారు!

ఈ నేపథ్యంలోనే మరో పదిహేను రోజుల్లో బీఆరెస్స్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటామని.. తర్వాత బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని.. కేటీఆర్ స్నేహితుల కథలన్నీ బయటపెడతామని.. అందరి లెక్కలూ బయట పెడతామని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో కావాలనే కవితను జైల్లో ఉంచుతున్నారని.. కావాలనే బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానం. ఈ క్రమంలోనే... అతి త్వరలోనే బీఆరెస్స్ మూతపడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News