నరసన్నపేటలో దాసన్న విలవిల...!?
శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం నరసన్నపేట. ఇది ధర్మాన కుటుంబానికి కంచు కోట.
శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం నరసన్నపేట. ఇది ధర్మాన కుటుంబానికి కంచు కోట. ధర్మాన కుటుంబాన్ని గత మూడున్నర దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తోంది. రెండు మూడు సందర్భాలలో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో ఈ నియోజకవర్గం ధర్మాన కుటుంబానికే పట్టం కట్టింది. వారికే కట్టుబడిపోయింది.
అయితే గతం వేరు వర్తమానం వేరు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజాకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీలో కీలకమైన నేత అయిన ధర్మాన క్రిష్ణదాస్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు.
ఇక్కడ వైసీపీలో వర్గ పోరు ఉంది. అది రెండేళ్ళ నుంచి ఉంది. సొంత పార్టీలో దానిని చక్కదిద్దుకోవడంలో దాసన్న ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. ధర్మాన క్రిష్ణదాస్ కి టికెట్ ఇవ్వవద్దు అన్న దాకా పరిస్థితి అయితే వచ్చింది. మరో వైపు చూస్తే రాజకీయంగా బలమైన ప్రత్యర్ధిగా టీడీపీ నుంచి భగ్గు రమణమూర్తి ఉన్నారు.
ఆయన 2014లో ఆ పార్టీ నుంచి గెలిచి క్రిష్ణదాస్ ని ఓడించారు. ఈసారి తనదే విజయం అని ఆయన అంటూంటే వైసీపీ అసమ్మతి నేతలు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఒకేసారి అటు సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి పార్టీతో క్రిష్ణదాస్ పోరాడాల్సి ఉంటోంది అని అంటున్నారు.
ఇక క్రిషణదాస్ విషయమే తీసుకుంటే 2004లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. 2009లోనూ రెండవసారి గెలిచి ఆ మీదట వైసీపీలోకి వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ మీద మూడవసారి గెలిచారు. కానీ 2014లో ఆయన ఓటమి పాలు అయ్యారు. 2019లో ఇరవై వేల ఓట్ల భారీ తేడాతో రమణమూర్తిని ఓడించారు.
ఇపుడు కూడా తనదే జయం అని దాసన్న అంటున్నా అసమ్మతి వర్గం ఏమి చేస్తుందో అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట వైసీపీ సీటు అని చెప్పుకునేవారు. ఇపుడు ఆ సీటే డౌట్ లో పడుతోంది అని అంటున్నారు.