నా కూతురికి బలవంతంగా గుడ్డు తినిపించారు.. ఆ తండ్రి ఫిర్యాదులో ఏముందంటే?

స్కూల్లో తన కుమార్తెకు బలవంతంగా కోడిగుడ్డు తినిపించారంటూ ఒక తండ్రి చేసిన ఫిర్యాదు కలకలాన్ని రేపింది.

Update: 2023-11-24 04:36 GMT

స్కూల్లో తన కుమార్తెకు బలవంతంగా కోడిగుడ్డు తినిపించారంటూ ఒక తండ్రి చేసిన ఫిర్యాదు కలకలాన్ని రేపింది. రెండో క్లాస్ చదివే తన కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారన్న ఆ తండ్రి.. తాము కఠినమైన శాఖాహారాన్ని తింటామని.. అలాంటి తమకు కోడిగుడ్డు తినమని బలవంతం ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగు చూసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ ఫిర్యాదుపై విద్యాశాఖ అధికారులు సైతం స్పందించారు. విచారణకు ఆదేశించారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలతో పాటు కంప్లైంట్ చేసిన వ్యక్తి కుమార్తె సైతం భోజనానికి కూర్చున్నారు. ఈ సందర్భంగా కోడిగుడ్డు తినాలని బలవంతంగా చేశారని.. దీంతో తన కుమార్తె కోడిగుడ్డు తిన్నదని.. దీంతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు. తాము శాఖాహారాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామని ముందే చెప్పామని.. అయినప్పటికీ టీచర్లు బలవంతంగా గుడ్డు తినిపించారంటూ ఆరోపించారు.

దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అయితే.. సదరు బాలిక తండ్రి ఆరోపించినట్లుగా విషయం ఏమీ జరగలేదని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వడ్డించే క్రమంలో సదరు చిన్నారి కూర్చుందని.. గుడ్డు ఎవరు తింటారని అడిగిన టీచర్లు పిల్లల్ని చేతులు ఎత్తమన్నారని.. సదరు చిన్నారి కూడా చెయ్యి ఎత్తటంతో గుడ్డు వడ్డించారే తప్పించి.. బలవంతంగా తినిపించింది ఏమీ లేదని స్పష్టం చేశారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు చేసిన క్రమంలో శివమొగ్గ విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారి స్పందిస్తూ.. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా చెప్పారు. అయితే.. తాము జరిపిన విచారణలో బలవంతంగా గుడ్డు తినిపించినట్లుగా తేలలేదన్న ఆయన.. ఒకవేళ అలాంటిది జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా రెండో తరగతి చదివే చిన్నారి గుడ్డు తినటమే ఏమో కానీ.. ఆ స్కూల్ టీచర్లకు చెమటలు పట్టాయని మాత్రం చెప్పక తప్పదు.


Tags:    

Similar News