తండ్రిని ఓడిస్తాన‌న్న ఇండిపెండెంట్ కూతురు.. రీజ‌న్ తెలిస్తే అవాక్కే!!

త‌న తండ్రిపోటీచేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన స‌ద‌రు త‌న‌య‌.. తండ్రిని ఓడించి తీరుతానని.. ఆయ‌న అనుకూల ఓట్లు చీల్చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేస్తోంది.

Update: 2023-11-25 01:30 GMT

కుటుంబం అన్నాక వివాదాలు.. విభేదాలు కామ‌నే. తండ్రికి కొడుకుల‌కు, తండ్రికి కూతుళ్ల‌కు పొస‌గ‌ని కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇక‌, భార్యా భ‌ర్త‌ల సంగ‌తి చెప్ప‌క్క‌ర్లేదు. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు.. విభేదాలు..ఎన్నిక‌ల వ‌ర‌కు పాకాయి. చిన్న‌ప్పుడు త‌మను ప‌ట్టించుకోలేదని, చ‌దువు కూడా స‌రిగా చెప్పించ‌లేద‌ని, కుటుంబాన్ని రోడ్డుకు వ‌దిలేసి బ‌య‌ట ఊరేగాడ‌ని(రాజ‌కీయాల్లో) ఆరోపిస్తూ.. ఓ కుమార్తె ఏకంగా త‌న తండ్రినే ఓడించేందుకు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది.

త‌న తండ్రిపోటీచేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన స‌ద‌రు త‌న‌య‌.. తండ్రిని ఓడించి తీరుతానని.. ఆయ‌న అనుకూల ఓట్లు చీల్చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేస్తోంది. అయితే.. ఈ విష‌యం ఒకింత ఆలస్యంగా దేశ‌వ్యాప్తంగా వ్యాపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఈ వార్త దేశ‌వ్యాప్తంగా హ‌ల్చ‌ల్ చేస్తోంది. రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌లు శ‌నివారం జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి అల్వార్‌ జిల్లాలోని అల్వార్ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇది ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే జైరాం జాటవ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఎస్సీల‌కు త‌ల‌లో నాలుక‌గా ఉంటార‌ని జైరాంకు మంచి పేరుంది. గ‌తంలోనూ ఆయ‌న వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈసారి ప్ర‌త్య‌ర్థుల కంటే.. కూడా త‌న క‌డుపున పుట్టిన కుమార్తే ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయిపోయారు. జైరాం కుమార్తె 46 ఏళ్ల మీనా కుమారి ఇదే స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఎన్నికల్లో గెలవడం పక్కనపెడితే.. తన తండ్రి ఓట్లను చీల్చాలనే లక్ష్యంతోనే పోటీలో దిగానని ఆమె చెబుతున్నారు.

మీనా వాద‌న ఇదీ..

బాల్యం నుంచి త‌న‌ తండ్రి జైరాం తనను సరిగ్గా పట్టించుకోలేదని, కుటుంబాన్ని హింసించేవాడని, చ‌దువు కూడా స‌రిగా చెప్పించ‌లేద‌ని మీనా ఆరోపించారు. అందుకే తండ్రికి వ్యతిరేకంగా బరిలో నిలబడ్డానని మీనా కుమారి చెప్ప‌డం గ‌మ‌నార్హం. 'ఆయనకు మూఢనమ్మకాలు ఎక్కువ. సొంత కుమార్తెనే ఆయన గౌరవించడు. అలాంటప్పుడు ఇతరుల కూతుళ్లను ఎలా గౌరవిస్తాడు? నన్ను పదే పదే హింసించేవాడు. కొన్ని సందర్భాల్లో బంధువుల సహాయంతోనూ వేధించేవాడు' అని మీనా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. భర్త తారాచంద్‌ ఆమెకు మద్దతుగా నిలవడంతోపాటు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. జైరాం అనుకూల ఓటు బ్యాంకు చీలిపోవ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News