లోకల్ కంపెనీలకు ఇంటర్నేషనల్ బ్రాండ్! దావోస్ లో సాధించిందేంటి?
నిజమే రెండు ప్రభుత్వాలు చెబుతున్నదాంటో వందశాతం నిజముందని అనుకున్నా, ఈ పెట్టుబడి ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం ఉందా?
దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రైజింగ్ స్టార్ గా నిలిచింది. రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయ వేదికపై మరోసారి ఏపీ బ్రాండ్ను ఆవిష్కరిస్తున్నాం. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. నిజమే రెండు ప్రభుత్వాలు చెబుతున్నదాంటో వందశాతం నిజముందని అనుకున్నా, ఈ పెట్టుబడి ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం ఉందా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
నాలుగు రోజులపాటు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరించిన తీరుపై విపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వందల కోట్ల రూపాయల ఖర్చుతో అంత దూరం వెళ్లి లోకల్ కంపెనీలతోనే చర్చలు జరిపి ఎంవోయూలు కుదుర్చుకున్నారని, ఆ పనేదో స్థానికంగా చేస్తే ప్రజాధనం మిగిలేది కదా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల వేటలో పైచేయి సాధించిన తెలంగాణకు వస్తున్న 20 ముఖ్య కంపెనీల్లో 90 శాతం లోకలే కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ పెట్టబడి ఒప్పందాలు దాదాపు 45 వేల ఉద్యోగాలంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా? దావోస్ సదస్సు పేరుతో ప్రజాధనం వృధా చేశారని బీఆర్ఎస్ చెబుతోంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం గ్రీన్ కోతో చేసుకున్న ఒప్పందాన్ని వైసీపీ తప్పుబడుతోంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే గ్రీన్ కో వంటి కంపెనీలతో ఒప్పందాలకు దావోస్ అంత దూరం వెళ్లాలా? అంటూ నిలదీస్తోంది.
దావోస్ సదస్సులో తెలంగాణకు మొత్తం రూ.1,78,850 కోట్లు పెట్టుబడులు సాధించింది. గత ఏడాది రూ.40 వేల కోట్లకు ఒప్పందాలు జరగ్గా ఇప్పుడు దానికి నాలుగు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే ఈ పెట్టుబడులన్నీ భారతీయ కంపెనీలవే.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి ఒకటి రెండు కంపెనీలు మాత్రమే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలుగా చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న మేఘా ఇంజనీరింగ్, జేఎస్ బ్ల్యూ, స్కైరూట్ ఏరో స్పేస్, హెచ్ సీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, యూనిలీవర్, ఉర్సా క్లస్టర్స్, టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్, అక్షత్ గ్రీన్ టెక్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, సుహానా మసాలా ఏకో ఫ్యాక్టరీ ఫైండేషన్ వంటి కంపెనీలు అన్నీ మనదేశానికి చెందినవే. వీటితో ఒప్పందాలు చేసుకోవాలంటే హైదరాబాద్ లో ఓ చిన్న సెమినార్ నిర్వహించిన సరిపోతుందని, ఆ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లాలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా పేరున్న సంస్థలేవీ తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది.
మరోవైపు ఏపీ భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే ఆ రాష్ట్రం దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లింది. విభజన తర్వాత ఏపీలో బాగా అభివృద్ధి చెందిన నగరం లేకపోవడం, టైప్ 2 నగరాలే ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం ఆ రాష్ట్రానికి సవాల్ గా మారింది. అయినప్పటికీ చంద్రబాబు తన అనుభవంతో అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలేవీ ఫలించినట్లు కనిపించలేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కారణమైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యం, ఏఐ, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనను పరిశీలిస్తానని చెప్పిన బిల్ గేట్స్ పెట్టుబడులపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం ఉండటంతో మారిటైమ్ రంగంలో పెట్టుబడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఏ సంస్థ కూడా పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటన చేయలేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 15 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఇద్దరు నేతలు పెట్టుబడుల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ స్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని సంస్థలు వేచిచూద్దామనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఉత్త చేతులతో తిరిగి వెళితే పరువు పోతుందనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం గ్రీన్ కో వంటి లోకల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
మొత్తానికి ఇరు రాష్ట్రాలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమైనట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబుది అంతా ప్రచార ఆర్భాటమేనంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుండగా, ఐటీకి తానే బ్రాండ్ అంబాసిడర్ అంటూ తెలంగాణ రైజింగ్ క్రెడిట్ ను కొట్టేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయత్నిస్తున్నారు.