ఆప్ ఎంత ఆప సోపాలు పడినా మోడీదే గెలుపు...?
ఇలా లెక్క వేసుకుంటే 127 ఓట్ల మద్దతుతో ఆప్ మీద పెట్టిన ఢిల్లీ సర్వీసుల బిల్లుని బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుంది
ఆప్ ది పదేళ్ళ రాజకీయ అనుభవం. కానీ నాలుగున్నర దశాబ్దాల పార్టీ అయిన బీజేపీని సవాల్ చేస్తోంది. మోడీ సర్కార్ కే చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో బీజేపీకి ఉన్న పట్టుని తీసి గట్టు మీద పెట్టిన ఆప్ స్ట్రాంగ్ అయింది. అందుకే ఆప్ అధికారాలకు కత్తెర వేయడానికి ఢిల్లీ సర్వీసుల బిల్లు పేరుతో బిల్లుని రెడీ చేసి మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టింది.
ఈ బిల్లుని నెగ్గించుకోవడం ద్వారా ఆప్ ని దారుణంగా దెబ్బతీయాలన్నదే బీజేపీ అజెండా. ఇక బీజేపీకి లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉంది. బిల్లు సునాయాసంగా నెగ్గుతుంది. కానీ రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. దాంతో అక్కడ కూడా మెజారిటీని కూడగట్టే పనిలో బీజేపీ ఉంది.
బీజేపీ సామర్థ్యాన్ని పసిగట్టిన ఆప్ విపక్ష కూటమికి ముందే షరతులు పెట్టి మరీ అందులో చేరింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కోత వేసే కేంద్రం బిల్లునకు మద్దతు ఇవ్వవద్దు అంటూ అన్ని విపక్ష పార్టీలను వేడుకుంది. అయితే ఏపీలోని వైసీపీని ఆప్ మద్దతు అడగలేదు. అడిగినా ఏమి జరిగేదో కానీ ఇపుడు కేంద్రం ప్రవేశపెట్టే ఈ బిల్లుకు వైసీపీ జై కొడుతోంది.
ఆ పార్టీకి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. ఇది బీజేపీకి ప్రాణప్రదమైన మద్దతుగా ఉంటుంది. ఇక బీజేపీకి ఇంకా మరో కీలకమైన మద్దతు ఒడిషాలోని బిజూ జనతాదళ్ నుంచి దక్కింది. ఆ పార్టీకి కూడా రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అంటే ఈ రెండు పార్టీల మద్దతు కలసి 18 మంది ఎంపీలు అయ్యారన్న మాట.
అదే విధంగా పెద్దల సభలో బీజేపీకి సొంతంగా 90 మంది ఎంపీలు ఉంటే ఎన్డీయేతో కలుపుకుని 103 మంది ఉన్నారు రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 గా ఉంది. అందులో ఏడు ఖాళీలను తీసేస్తే 238 మంది నంబర్ గా ఉంది. ఇందులో సగానికి ఒక ఓటు అదనం అంటే 120 మంది మద్దతు ఉండాలి.
ఇపుడు చూస్తే బీజేపీకి వైసీపీ బిజూ జనతాదళ్ తో కలుపుకుని 121 మంది మద్దతు లభించింది. ఒకే ఒక్క టీడీపీ ఎంపీ మద్దతు కూడా ఆ పార్టీదే అంటున్నారు. దీంతో పాటు అయిదుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా బీజేపీకి ఉంది. ఇలా లెక్క వేసుకుంటే 127 ఓట్ల మద్దతుతో ఆప్ మీద పెట్టిన ఢిల్లీ సర్వీసుల బిల్లుని బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుంది.
ఈ బిల్లు చట్టం అయితే కనుక ఆప్ కేవలం నామమాత్రపు ప్రభుత్వంగా మిగులుతుంది. ఏ విషయం మీద అయినా తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కి దఖలు పడుతుంది. ఇండియా కూటమి కట్టాక కూడా మోడీ పార్లమెంట్ లో గెలిస్తే మాత్రం అది విపక్షాలకు పెను సవాలే అని అంటున్నారు. మరి ఆప్ ఆపసోపాలకు బీజేపీ మార్క్ ట్రీట్మెంట్ ఇది అని కమలనాధుల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.