డిప్యుటేషన్ అధికారులు రిలీవ్ అయ్యే ఛాన్సు లేదు

కీలక స్థానాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్షపాతంతో వ్యవహరించకూడదు. ఒకరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకూడదు

Update: 2024-06-06 15:30 GMT

కీలక స్థానాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్షపాతంతో వ్యవహరించకూడదు. ఒకరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి మీదా వ్యక్తిగత కక్షను ప్రదర్శించకూడదు. ప్రభుత్వ విధానాలకు తగ్గట్లు పని చేయటం తప్పేం లేదు కానీ.. సదరు ప్రభుత్వ లైన్ తేడాగా ఉంటే.. అప్రాధాన్యత పోస్టులకు వెళ్లటం మంచిదే తప్పించి.. పవర్ కోసం ప్రాకులాడటం.. అధికారంలో ఉన్న వారు ఏం చెబితే అది చేస్తే అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కొందరు కీలక అధికారులు.

జగన్ ప్రభుత్వంలో ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారుల మీద తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్ మీద వచ్చిన పలువురు అధికారులు.. ఏపీలో ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో తమను రిలీవ్ చేయాలంటూ ఆర్జీలు పెట్టుకున్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీవ్ చేయకూడదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో డిప్యుటేషన్ మీద వచ్చిన పలువురు ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు తెలుగుదేశం పార్టీపైనా.. నేతలపైనా పెద్ద ఎత్తున విమర్శలు చేయటం.. వారి విషయంలో పూర్తి పక్షపాతంతో వ్యవహరించినట్లుగా విమర్శలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వారి బదిలీ అప్లికేషన్లను సైతం ఆపేయాల్సిందిగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో కొలువు తీరనున్న వేళ.. జారీ అయిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమను రిలీవ్ చేయాలని దరఖాస్తులు చేసుకున్న వారిలో స్టాంపులు.. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామక్రిష్ణ, సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ ఎస్ఎస్ రావత్.. శ్రీలక్ష్మితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సతీమణులు సైతం తమడిప్యుటేషన్లు రద్దు చేసుకొని వెళ్లాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. అదే సమయంలో టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి సెలవులపై వెళ్లేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీన్ని కూడా రిజెక్టు చేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సైతం సెలవుల మీద వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా.. అందుకు సీఎస్ తిరస్కరించారు.

అదే సమయంలో.. డిప్యుటేషన్ అభ్యర్థనలు.. సెలవులకు నో అంటూ సీఎస్ నుంచి వెలువడిన ఆదేశాలు సంచలనంగా మారాయి. తమ తమ మాత్ర సంస్థలకు వెళ్లాలని అప్లికేషన్లు పెట్టుకున్న వారిలో కొందరు కేంద్ర సర్వీసుల నుంచి వస్తే.. మరికొందరు తెలంగాణ నుంచి వచ్చారు. ఇప్పుడు వారందరూ ఏపీలోనే పని చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు బాధ్యుల్ని చేయటంతో పాటు.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు జరుగుతుంది. అదే జరిగితే.. ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో పెను ప్రకంపనల్ని క్రియేట్ చేసే వీలుంది. అధికారంలో ఉన్న వారికి వంతపాడటం అలవాటుగా మారి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తదనంతర పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయాలన్నది ఏపీకి ముఖ్యమంత్రి కానున్న చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

Tags:    

Similar News